విడాకులివ్వకుండానే రెండో పెళ్లి

5 Nov, 2019 11:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బాధితురాలి ఫిర్యాదు  

నిందితుడిపై కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని అబద్ధాలు చెప్పి రెండో వివాహం చేసుకున్న తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వైజాగ్‌కు చెందిన మహిళ(37) 2018 మార్చి 8న శివరాంరెడ్డి అనే వ్యక్తిని యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుంది. అనంతరం వారు విశాఖపట్నం మహారాణిపేట అఫీషియల్‌ కాలనీలో కాపురం పెట్టారు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు శివ చెప్పడంతో ఆమె అతడి మాటలు నమ్మింది. అయితే కొద్ది నెలల్లోనే నిజం వెల్లడి కావడంతో అతడిని నిలదీసింది.

దీనికితోడు ఐబీఎంలో మేనేజర్‌గా పని చేస్తున్న తనను ఉద్యోగం మాన్పించి వైజాగ్‌లో కాపురం పెట్టాడని కొద్ది రోజుల్లోనే తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. తన వద్ద నుంచి విడతల వారీగా రూ. 35 లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. మీలాంటి లోక్లాస్‌ మహిళను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని నీ జీతం నా ఒక్కరోజు ఖర్చుతో సమానమని అవమానించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె గత జూన్‌ 24న హైదరాబాద్‌ వచ్చి శివరాం రెడ్డి కుటుంబ వివరాలు ఆరా తీయగా అతను మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నట్లు వెల్లడైంది. దీనికితోడు  కారు రుణం చెల్లించలేకపోవడంతో బ్యాంకు నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పేందుకు ప్రయత్నించగా అతను అందుబాటులోకి రాలేదు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు