ఫ్యామిలీప్లానింగ్‌ విభాగంలో పాడుపని

27 Oct, 2017 08:56 IST|Sakshi

గాంధీలో సెక్యూరిటీ సిబ్బంది రాసలీలలు

రోగుల సమాచారంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

ఇద్దరు సెక్యూరిటీ గార్డుల సస్పెన్షన్‌

మరో నలుగురిపై యాజమాన్యానికి ఫిర్యాదు

సాక్షి, సికింద్రాబాద్‌: నిరుపేద రోగులకు ఇబ్బందులు కలగకుండా  కాపలాకాయాల్సిన సెక్యూరిటీ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో రోగులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించిన సంఘటన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రి అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాంధీ ఆస్పత్రిలో ఎజిల్‌ గ్రూప్‌ సంస్థ  సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్‌ కంట్రోల్, పేషెంట్‌ కేర్‌ విభాగాలను కాంట్రాక్టు పద్ధతిన నిర్వహిస్తోంది.  సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన రాంకిలాన్‌ పాండే , రాజు, సదానంద్‌పాండే, భరత్‌మోహన్, సందీప్‌పాండే ఆస్పత్రి సెల్లార్‌లోని ఓ గదిలో ఉంటున్నారు. రాంకిలాన్‌పాండే సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ కాగా, మిగిలిన వారంతా గార్డులు.

15 రోజుల క్రితం ఓ మహిళ ఎజిల్‌ సంస్థ తరుపున ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా చేరింది. ఆమెపై కన్నెసిన సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ రాంకిలాన్‌ పాండే ఉద్యోగంలోంచి  తీసేస్తానని బెదిరించి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బుధవారం రాత్రి ఆమె గైనకాలజీ ఇన్‌పేషెంట్‌వార్డులో విధులు నిర్వహిస్తుండగా, అక్కడికి వచ్చిన పాండే ఆమెను తీసుకుని ఫ్యామిలీప్లానింగ్‌ విభాగంలోని ఓ గదిలోకి వెళ్లాడు. దీనిని గుర్తించిన రోగులు గదికి బయట నుంచి గడియ పెట్టి ఆస్పత్రి అధికారులు, అవుట్‌పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం ఉదయం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎదుట హాజరుపరిచారు.

ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ నర్సింహరావునేత మీడియాతో మాట్లాడుతూ అసభ్యకరమైన రీతిలో పట్టుబడిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులను తక్షణమే విధుల  నుంచి తొలగిస్తున్నామని, బీహార్‌కు చెందిన మరో నలుగురు సెక్యూరిటీగార్డులపై నిర్వహణ సంస్థ ఎజిల్‌ గ్రూప్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశామన్నారు. సెక్యూరిటీ సంస్థకు నోటీసుల జారీ చేశామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు