ఆ 30 లక్షలు దొరికాయ్‌!

6 Aug, 2018 19:13 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సుమతి (ఇన్‌సెట్‌లో), రికవరీ చేసిన నగదు

సాక్షి, హైదరాబాద్‌ : 30 లక్షల రూపాయల మిస్సింగ్‌ కేసును సికింద్రాబాద్‌, గోపాలపురం పోలీసులు సోమవారం చేధించారు. ఈ నెల1న (బుధవారం) నల్లకుంటకు చెందిన భగవతుల మోహిని(50), ఆమె తల్లి సుశీల(85)లు విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటోలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు బయల్దేరారు. మధ్యలో రూ.30 లక్షల రూపాయలున్న బ్యాగును పోగొట్టుకున్నారు. రైల్వే స్టేషన్‌కు వచ్చాక నగదు ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో తిరిగి అదే రూటులో ఎంత వెతికినా దొరకలేదు.

దీంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా అన్ని కోణాల్లో పరిశీలించిన వారు సీసీ కెమెరాల సాయంతో కేసును చేధించారు. వారు ప్రయాణించిన మార్గంలోని మొత్తం 42 సీసీ కెమెరా వీడియోలను పరిశీలించిన పోలీసులు.. బ్యాగ్‌ను మహేశ్వరానికి చెందిన మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ స్వీపర్‌ రాములు(48) తీసుకున్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని రూ.28 లక్షలు రికవరీ చేశారు. కేసును త్వరగా చేధించిన పోలీసులకు డీసీపీ సుమతి రివార్డులు అందజేశారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా అందరూ తప్పనిసరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. 

మరిన్ని వార్తలు