సీజ్‌ చేసిన పటాకులను పూడ్చేశారు

19 Oct, 2017 11:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పటాకుల అమ్మకంపై నిషేధం విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు విధించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎక్కడా అక్రమ అమ్మకాలు జరగకుండా పోలీసులు బాగానే గస్తీ కాచి.. పలు చోట్ల నిల్వలను స్వాధీనపరుచుకుని సీజ్‌ చేసి.. కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ బీజేపీ నేత తజిందర్‌ బగ్గా లాంటి వాళ్లు అమ్మటం తప్పే కానీ పంచటం కాదంటూ రంగంలోకి దిగిపోగా.. కొన్ని హిందు సంఘాలు ఏకంగా సుప్రీంకోర్టు ముందే బాణాసంచాలు కాల్చి నిరసన వ్యక్తం చేశారు.

ఇంతదాకా బాగానే ఉన్నా ఇప్పడు ఢిల్లీ పోలీసులకు కొత్త సమస్య వచ్చి పడింది. ఎందుకంటే కోర్టు అమ్మకంపై నిషేధం విధించే తప్ప.. నిల్వ చేయటం గురించి కాదు. దీంతో ఆ దిశగా వాదనలు వినిపించి నిందితులు కేసు నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆ సమయంలో పోలీసుల స్వాధీనంలో ఉన్న బాణాసంచాను తిరిగి విక్రయదారులకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దోషులుగా తేలితే మాత్రం వాటిని నాశనం చేయొచ్చు. దీంతో అప్పటిదాకా వాటిని జాగ్రత్తగా భద్రపరచాల్సిన బాధ్యత పోలీసులనే పైనే ఉంది. కానీ, అంత మొత్తంలో పేలుడు పదార్థాలను భద్రపరటం కత్తి మీద సాము వంటిదే.

అయితే ఇందుకోసం సీనియర్‌ అధికారులు ఓ సలహా ఇచ్చారు. వాటిని భూమిలో గుంతలు తీసి పూడ్చి పెట్టాలని. ‘‘చాలా మట్టుకు బాణాసంచాను పొరుగు రాష్ట్రం హర్యానాకు పంపించి అక్కడ సురక్షిత ప్రాంతాల్లో భద్రపరిచాం. అయినా చాలా మట్టుకు మిగిలిపోయాయి. వాటిని పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరచటం చాలా ప్రమాదకరం. అందుకే వాటిని గోతుల్లో దాచి పెడుతున్నాం’’ అని మంగొలిపూరి స్టేషన్‌ అధికారి దీపేంద్ర పాథక్‌ చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి విధానాలను సైన్యం అనుసరిస్తూ ఉంటుందని ఆయన చెప్పారు. సుప్రీం ఆదేశాలు వెలువడిన నాటి నుంచి నేటి దాకా సుమారు 1,200 కేజీల బాణాసంచాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు