నేను చనిపోతా.. పర్మిషన్‌ ఇవ్వండి

12 Jun, 2018 07:46 IST|Sakshi

వృద్ధాప్యంలో కుమారుడు పట్టించుకోవడం లేదు..

మరోవైపు రూ.25 లక్షలు తీసుకుని తోటి ఉద్యోగి మోసం చేశాడు

ఎస్పీకి ఫిర్యాదు చేసిన పురావస్తు శాఖ విశ్రాంతి ఉద్యోగి

లక్ష్మీపురం (గుంటూరు): ‘వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కుమారుడు పట్టించుకోవడం లేదు.. మరోవైపు ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి దగ్గర నుంచి నా ద్వారా రూ.25 లక్షలు తీసుకుని తోటి ఉద్యోగి మోసం చేశాడు. డబ్బులిచ్చిన వారు నాపై ఒత్తిడి చేస్తున్నారు. ఇక నాకు చావే శరణ్యం. కారుణ్య మరణానికి అనుమతివ్వండి’ అని పురావస్తు శాఖ విశ్రాంత ఉద్యోగి పి.రామచంద్రరావు గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావుకు విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఆయన ఎస్పీని కలిసి వినతిపత్రం అందించారు. రామచంద్రరావు గుంటూరు శ్రీనగర్‌ కాలనీలో నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

అనారోగ్య కారణంగా రామచంద్రరావు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) చేసి పెద్ద కుమారుడు పి.సురేష్‌ కుమార్‌కు అదే శాఖలో ఉద్యోగం ఇప్పించారు. కాగా, తనతో పాటు అదే శాఖలో గోల్కొండలో ఏడేళ్లపాటు అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించిన మల్లెల శివకుమార్‌.. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి తన ద్వారా రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశాడని రామచంద్రరావు ఆరోపించాడు. డబ్బు చెల్లించిన వారు నిత్యం వేధింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడికి ఉద్యోగం కోసం రూ.6 లక్షలు అప్పు చేశానని, ఆ డబ్బును తన కుమారుడు ఇవ్వడం లేదని వాపోయాడు. ఈ పరిస్థితుల్లో తనకు చావే శరణ్యమని.. కారుణ్య మరణానికి అనుమతివ్వాలని ఎస్పీ ఎదుట కన్నీటిపర్యంతమయ్యాడు. డబ్బు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించలేదని రామచంద్రరావుపై నమోదైన కేసుపై ఎస్పీ ఆరా తీశారు. కేసును క్షుణ్నంగా దర్యాప్తు చేయాలని, రామచంద్రరావుకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డీఎస్పీని ఆదేశించారు.

మరిన్ని వార్తలు