కుంభమేళా వద్ద సీరియల్‌ కిల్లర్‌ అరెస్టు

26 Jan, 2019 16:24 IST|Sakshi
కుంభమేళా వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాలు

లక్నో : వరుస హత్యలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న సీరియల్‌ కిల్లర్‌ను కుంభమేళా వద్ద అలహాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆర్నెళ్లలో పది మందిని హతమార్చి మరో ఇద్దరిని హత్య చేయబోయిన అతడిని పట్టుకున్న టీమ్‌కు 50 వేల రూపాయల నజరానా లభించింది. వివరాలు... ప్రయాగ్‌ రాజ్‌(అలహాబాద్‌) జిల్లా బసెహర గ్రామానికి చెందిన కలువా అలియాస్‌ సుభాష్‌(38) గతేడాది జూలై నుంచి కిడీగంజ్‌, పరేడ్‌గ్రౌండ్‌, కుంభమేళా తదితర ప్రాంతాల్లో వరుసగా హత్యలకు పాల్పడ్డాడు. ఫుట్‌పాత్‌పై నిద్రించే కూలీలను లక్ష్యంగా చేసుకుని అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

ఈ క్రమంలో శుక్రవారం కుంభమేళా పరిసర ప్రాంతాల్లో నిద్రపోతున్న ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన ఎస్‌ఎస్‌సీ నితిన్‌ తివారీ మాట్లాడుతూ...‘ గత ఆరు నెలలుగా సుభాష్‌ పది మందిని హత్య చేశాడు. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. బాధితుల దుస్తులతోనే వారి ముఖాన్ని కప్పి ఊపిరాడకుండా చేసేవాడు. ఆ తర్వాత గొడ్డలి వంటి పదునైన ఆయుధాలతో దాడికి పాల్పడి వారిని అంతమొందించేవాడు’  అని చెప్పారు. హత్యలు చేయడం వెనుక అతడి ఉద్దేశం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విచారణలో ఆ విషయాలన్నీ బయటపడతాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు