దారుణం: అన్నం పెట్టలేదన్న కోపంతో..

26 Aug, 2019 06:46 IST|Sakshi

సాక్షి, చెన్నై : ఊరి చివరన ఉన్న తోటలను టార్గెట్‌గా చేసుకుని ఓ సీరియల్‌ కిల్లర్‌ హత్యలకు పాల్పడ్డాడు. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడానికి నిరాకరించిన ముగ్గురిని దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరుకు.. మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పలువురు హత్యకు గురయ్యారు. గత ఏప్రిల్‌ 20వ తేదీ ఏళుమలైకు చెందిన వెల్లస్వామి తన తోటలో హత్యకు గురయ్యాడు. గత మే 30వ తేదీ లింగనాయకన్‌పట్టికి చెందిన అయ్యర్‌ దేవర్‌ తోటలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యల గురించి ఉసిలంపట్టి, ఏళుమలై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ వచ్చారు. ఇలా ఉండగా గత నాలుగవ తేదీన విక్రమంగళం సమీపాన బాల్‌స్వామి అనే వ్యక్తి తన తోటలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలన్ని ఒకే రకంగా ఉండటంతో పోలీసులు ప్రత్యేక విచారణ చేపట్టారు. విక్రమంగళం ప్రాంతములో సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

అతను తేని జిల్లా కంభం సమీపాన గల గోవిందన్‌పట్టికి చెందిన వేల్‌మురుగన్‌ (48)గా తెలిసింది. ఇతడే ఆ మూడు హత్యలు చేసినట్టు విచారణలో బయటపడింది. రాత్రి వేళ ఆకలి వేస్తే ఊరు చివరగా ఉండే తోటలకు వెళ్లి అక్కడ తోటమాలిలను అడిగేవాడు. ఆహారం లేదని చెప్పిన వారిని హతమారుస్తూ వచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వేల్‌మురుగన్‌ను అరెస్టు చేశారు. విచారణలో 2002 సంవత్సరం ఉసిలంపట్టిలో వృద్ధ దంపతులను హత్య చేసిన కేసులో అతను జైలు శిక్ష అనుభవించి 2015లో విడుదలైనట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు