సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి బైక్‌ వీడియో వైరల్‌

2 May, 2019 13:43 IST|Sakshi

శ్రీనివాస్‌రెడ్డి ఎప్పుడూ ఎవరితోనూ కలవడు. ఎవరికీ ఎక్కువగా కనిపించడు. కానీ, ఏదైనా అఘాయిత్యం చేసినప్పుడు మాత్రం అందరి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తాడు. తద్వారా తనపై అనుమానం రాకుండా చూసుకుంటాడని తెలుస్తోంది. అదే క్రమంలో ఈ నెల 26వ తేదీన హఠాత్తుగా ఊర్లో ప్రత్యక్షమయ్యాడు. ఊరి మధ్యలో ఉన్న చిన్న ఖాళీ ప్రదేశంలో పిల్లలు క్రికెట్‌ ఆడుతుంటే తాను కూడా ఆడాడు. మర్నాడు తన పాఠశాల మిత్రుడి పెళ్లికి భువనగిరి వెళ్లాడు. మిత్రులతో కలిసి విందులో పాల్గొని చిందులేశాడు. శ్రీనివాసరెడ్డిలో ఉత్సాహం చూసి తాము ఆశ్చర్యపోయామని.. ముభావంగా ఉండే అతను ఇంతలా ఆనందించడం తాము ఎప్పుడూ చూడలేదని చిన్ననాటి మిత్రులు తెలిపారు. అయితే, తాను చేసిన ఘోరం బయటపడకుండా, అనుమానం రాకుండా ఉండేందుకే తన స్వభావానికి విరుద్ధంగా శ్రీనివాస్‌రెడ్డి ప్రవర్తించాడని ఇప్పుడు అర్థమవుతోందన్నారు. 25న పాఠశాలకు వెళ్లివస్తున్న బాలికకు లిఫ్ట్‌ ఇచ్చి బావివద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. దీని వెనుక తానే ఉన్నట్లు ఎవరికీ అనుమానం రాకూడదనే... ఊర్లోకి వచ్చి క్రికెట్‌ ఆడినట్లు, తర్వాత రోజు మిత్రులతో కలిసి పెళ్లిలో చిందులు వేసినట్లు విశ్లేషిస్తున్నారు. తాజాగా అతను ఒక బైక్‌ మీద వెనుక కూర్చొని.. హల్‌చల్‌ చేస్తూ ప్రయాణిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది.

శ్రీనివాస్‌రెడ్డి మొహంలో ఎప్పుడూ ఎలాంటి భావం కనిపించదని... అతడితోపాటు పదో తరగతి వరకూ చదివినవాళ్లు చెబుతున్నారు. వాళ్ల క్లాస్‌లో  150 మంది ఉండేవారని, వారిలో ఏ ఒక్కరితోనూ శ్రీనివాస్‌రెడ్డి కలిసిపోయేవాడు కాదన్నారు. చదువుల్లో వెనుకబడి ఉండేవాడని, ఒక్కోసారి ఉపాధ్యాయులు కర్రతో కొడుతుంటే ఎన్ని దెబ్బలైనా తినేవాడు కానీ అతడి మొహంలో బాధ, భయం వంటి భావాలేవీ కనిపించేవి కాదంటున్నారు. ఊర్లోనూ ఎవరితో కలిసేవాడు కాదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంతటి తీవ్రనేర స్వభావం ఉన్న వ్యక్తి ఇన్నేళ్ల నుంచీ ఎందుకు ఖాళీగా ఉంటాడనేది ప్రశ్న. ఈ మధ్యకాలంలోనూ ఇలాంటి అఘాయిత్యాలు చేసి ఉండొచ్చని, అవేవీ బయటకు వచ్చి ఉండవని పోలీసులు అనుమానిస్తున్నారు.

లిఫ్టు మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌రెడ్డి అనేక ప్రాంతాలు తిరుగుతుంటాడు. దీనిలో భాగంగానే కర్నూలు వెళ్లి అక్కడ ఒక యువతిని హత్యచేసి పీపాలో కుక్కాడు. ఫేస్‌బుక్‌ ఖాతాలో 631 మంది స్నేహితులు ఉంటే వారిలో పురుషులు 50 మంది కూడా లేరు. మిగతా యువతులంతా వేరువేరు ప్రాంతాలకు చెందిన వారు. ఆ పరిచయంకొద్ది ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఏమైనా చేసి ఉంటాడా? అనేది అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో వేములవాడ, నిజామాబాద్‌, కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లో అదృశ్యమైన యువతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దాంతోపాటు హాజీపూర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విచారిస్తున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ద్వారా ఈ అనుమానాలన్నీ నివృత్తి చేసుకునేందుకు మరోమారు తమ అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు.

గతంలో ఒక మహిళను వేధించడంతో ఊరివారంతా కలిసి శ్రీనివాస్‌రెడ్డిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అది శ్రీనివాస్‌రెడ్డి మనసులో బలంగా నాటుకుపోయిందని అతన్ని విచారించిన అధికారులు చెబుతున్నారు. ఎవర్నైనా బలవంతం చేసినప్పుడు వారు ఒప్పుకోకపోతే ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేసేవాడు కాదని...ఒకవేళ వారు బయటకెళ్లి చెబితే మళ్లీ కొడతారనే భయంతో అక్కడే హతమార్చేవాడని తెలిపారు. ఇదే అతడి మనస్తత్వమని శ్రీనివాస్‌రెడ్డిని విచారించిన ఓ అధికారి తెలిపారు.

యాదాద్రి భువనగిరిజిల్లా హాజిపూర్‌లోని సైకో కిల్లర్‌ శ్రీనివాసరెడ్డిని పోలీసులు కస్టడీకి కోరనున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పథకం ప్రకారమే సిరియల్‌ హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి సెల్‌ఫోన్‌ డేటా, ఫేస్‌బుక్‌ ఐడీని పోలీసులు పరిశీలిస్తున్నారు.నిందితుడు శ్రీనివాసరెడ్డి తరచూ కరీంనగర్‌ ప్రాంతాలకు వెళ్తున్నట్లు గుర్తించారు.  బొమ్మలరామారం బాలికల అదృశ్యం, హత్య ఘటనలపై తీవ్రంగా స్పందించిన రాచకొండ సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా