అంతా అబద్ధం సార్‌..

4 Jan, 2020 02:45 IST|Sakshi
విచారణ అనంతరం నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని జైలుకు తరలిస్తున్న పోలీసులు

హాజీపూర్‌ హత్యలకు, నాకు సంబంధం లేదు

జడ్జి ఎదుట నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి

కేసు తదుపరి విచారణ 6వ తేదీకి వాయిదా

నల్లగొండ: ‘అంతా అబద్ధం సార్‌.. హాజీపూర్‌లో జరిగిన హత్యలకు, నాకు ఎలాంటి సం బంధమూ లేదు. పోలీసులే నన్ను ఇరి కించా రు. ఆ హత్యలకు సంబంధించి సాక్ష్యాలన్నీ అబద్ధమే. మృతుల దుస్తులపై ఉన్న వీర్యకణాలకు నాకు సంబంధం లేదు. పోలీసులు సిరంజి ద్వారా నాదగ్గర నుంచి వీర్యం తీసుకెళ్లారు. నాకు ఆండ్రాయిడ్‌ ఫోనే లేదు. బూతు బొమ్మలు చూశాననడం అబద్ధం’అంటూ హాజీపూర్‌ వరుస హత్యల కేసు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి.. జడ్జి ఎదుట చెప్పాడు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో జరిగిన శ్రావణి, కల్పన, మనీషాల అత్యాచారం, హత్యలపై శుక్రవారం నల్లగొండ జిల్లా ఫస్ట్‌ అడిషనల్‌ సెషన్‌ కోర్టులో న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి విచారణ నిర్వహించారు. 6 గంటల పాటు విచారణ సాగింది.

ప్రాసిక్యూషన్‌ తరఫున న్యాయవాది చంద్రశేఖర్, నిందితుడి తరఫున న్యాయవాది ఎస్‌.ఆర్‌. ఠాగూర్‌లు హాజరయ్యారు. కాగా ఇదివరకే మనీషా హత్యకు సంబంధించి సాక్ష్యాలపై విచారణ జరిగింది. శుక్రవారం శ్రావణి, కల్పనలకు సంబంధించి 72 మంది సాక్షులు చెప్పిన వాంగ్మూలాలను న్యాయమూర్తి ఒక్కొక్కటి చదివి నిందితుడికి విని పించారు. అతనినుంచి ఒక్కో దానిపై సమాధానం తీసుకొని రికార్డు చేశారు. ‘సాక్షులు అందరూ శ్రీనివాస్‌రెడ్డే నిందితుడని సాక్ష్యం చెప్పారు. దీనిపై ఏమి చెబుతావు’అని న్యాయమూర్తి అడగగా ‘నాకూ ఆ హత్యలకు సంబంధంలేదు. కావాలనే నన్ను ఇరికించారు’అంటూ సమాధానం చెప్పాడు.

నీ తరఫున సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా, ‘మా అమ్మానాన్నలను పిలిపించండి’అంటూ సమాధానం చెప్పాడు. వారు ఎక్కడున్నారని అడగ్గా, వారి అడ్రెస్‌ కూడా తెలియదని తెలిపాడు. ‘నువ్వు ఇంతకుముందు పనిచేసిన వారి అడ్రస్‌ ఇవ్వు.. పిలిపిస్తాము’అని న్యాయమూర్తి అడగ్గా వారి అడ్రస్‌ కూడా లేదని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి.. నువ్వు పని చేశానని చెప్పావు, పనిచేసే చోట అడ్రస్‌ తెలియకుండానే పనిచేశావా అని అడగ్గా, ‘తెలియదు, మా అమ్మానాన్ననే పిలిపించాలి ’అంటూ న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు . వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.

అసలు నాకు మగతనం లేదు..
‘నాలుగు సంవత్సరాల క్రితం కల్పన అనే అమ్మాయిని కూడా అత్యాచారం, హత్య చేసి బస్తాలో మూటకట్టి అదే మర్రిబావిలో పాతిపెట్టావు, అది కూడా అందరి ముందు నేనే పాతిపెట్టానని ఒప్పుకున్నావు’కదా అని న్యాయమూర్తి అడగ్గా ‘అంతా అబద్ధం.. నన్ను పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. బావి వద్దకు తీసుకెళ్లలేదు’అని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పాడు. ‘మృతుల బట్టలపై ఉన్న వీర్యం నీదేనని పరీక్షలో తేలింది. నువ్వే అత్యాచారం చేశావు’అన్నప్పుడు ‘నాకు మగతనం లేదు’అంటూ సమాధానం చెప్పాడు. వైద్యులు నువ్వు ఫిట్‌గానే ఉన్నావని ‘నువ్వు పని చేసే చోట ఒక వేశ్యని తీసుకొచ్చి చంపి నీటి ట్యాంక్‌లో వేశావని, అప్పట్లో నిన్ను కర్నూల్‌లో పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కూడా చేశారు కదా’అని అడగ్గా అది కూడా అబద్ధమేనని నిందితుడు సమాధానం చెప్పాడు.

మర్రిబావి సమీపంలో ఓ చెట్టు దగ్గర ఉన్న బీరు సీసాలను ఫింగర్‌ప్రింట్స్‌ నిపుణులు పరీక్షలు చేస్తే ల్యాబ్‌లో నీ వేలిముద్రలేనని తేలిందని, దానికి నీ సమాధానం.. అంటూ జడ్జి అడగ్గా పోలీసులు బలవంతంగా బీరు సీసాను పట్టించారని చెప్పాడు. ‘నీకు నాలుగైదు ఫోన్‌ నంబర్లు ఉన్నాయి, నీ ఫోన్‌ లో చనిపోయిన శ్రావణి, కల్పన, మనీషాల ఫొటోలు ఉన్నాయి. నీఫోన్‌ సీజ్‌ చేసి డేటాను పరిశీలించగా నువ్వు బూతు బొమ్మలు చూసేవాడివని తేలింది, దానికి నీ సమాధానం ఏమిటి’అని అడగ్గా నిందితుడు ‘నాకు చిన్న ఫోన్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లేదు.’అని చెప్పాడు.

భూమి అమ్మలేదని కేసు పెట్టారు..
పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన 101 మంది సాక్ష్యాల విషయంలోనూ నిందితుడు.. అంతా అబద్ధం, పోలీసులు కావాలని చేశారని సమాధానం చెప్పాడు. , నీ మీద కేసు ఎందుకు పెట్టినట్లు’.. అని అడగ్గా ‘మా భూమి అమ్మలేదని కొందరు చేశారు. కావాలనే ఇరికించారు’అని చెప్పడం గమనార్హం.

మరిన్ని వార్తలు