యూపీలో మరో బీజేపీ నేత హత్య

13 Oct, 2019 17:35 IST|Sakshi

లక్నో : బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ఆ పార్టీ నేతల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. కేవలం వారం వ్యవధిలోనే ముగ్గురు బీజేపీ నాయకులు హత్యకు గురికావడం ఆ పార్టీ శ్రేణులను షాక్‌కు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. డియోబండ్‌కు చెందిన ధారా సింగ్‌ అనే వ్యక్తి బీజేపీ కార్పొరేటర్‌గా ఉంటూనే స్థానికంగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీలో సెక్టార్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నాడు. శనివారం ధారా సింగ్‌ ఫ్యాక్టరీలో విధులు ముగించుకొని బైక్‌పై తన నివాసానికి తిరిగి వస్తుండగా, సమీపంలోని రాన్‌ఖండి రైల్వే క్రాసింగ్‌ వద్ద ఇద్దరు దుండగులు అతడిని అడ్డగించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ధారాసింగ్‌ అక్కడికక్కడే కూలబడిపోయాడు. అయితే ధారాసింగ్‌ను గుర్తించిన స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ ఘటనపై ఎస్పీ దినేష్‌ కుమార్‌ వివరాలు వెల్లడిస్తూ.. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నట్టు తెలిపారు. కాగా,  ఇదే ప్రాంతంలో అక్టోబరు 8న  చౌదరీ యాశ్పాల్‌ సింగ్‌ అనే నాయకుడు కూడా హత్యకు గురయ్యాడు. తర్వాతి రెండు రోజులకు బస్తీ జిల్లాలో బీజేపీ విద్యార్థి నాయకుడు కబీర్‌ తివారి చంపబడ్డాడు. ఈ ఘటనపై ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఆందోళనలు నిర్వహించి ఆవేశంతో అనేక వాహనాలను తగలబెట్టారు. ఈ నేపథ్యంలో హంతకులను పట్టుకోవడంలో విఫలమై, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీ పంకజ్‌కుమార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు హోంశాఖ కార్యదర్శి వెల్లడించారు. ఇలా ఒకే పార్టీకి చెందిన నాయకులు వరుసగా హత్యలకు గురికావడం స్థానికంగా సంచలనం రేపుతోంది.

మరిన్ని వార్తలు