మూడు బైక్‌లు.. ఆరుగురు దొంగలు

10 Jan, 2020 11:23 IST|Sakshi
హంపాపురంలో బీరువా పగులగొట్టి చీరలు ఎత్తుకెళ్లిన దృశ్యం (ఇన్‌సెట్‌) కట్‌ చేసిన బీగం

చోరీల్లో సరికొత్త పంథా 

వనపర్తి టు అనంతపురం.. వయా కర్నూలు 

బైకులపై తిరుగుతూ వరుస చోరీలు 

డబ్బు, బంగారం, పట్టుచీరల అపహరణ

సీసీ కెమెరాలకు చిక్కకుండా చాకచక్యంగా దోపిడీ 

సాక్షి, అనంతపురం: జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మూడు బైకుల్లో ఆరుగురు దొంగలు కలియతిరుగుతూ ఎంచక్కా చోరీలకు పాల్పడుతున్నారు. మూడు రోజులుగా జిల్లాలో మకాం వేసి అందినకాడికి దోచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి నుంచి మొదలైన ఈ దొంగల ప్రహసనం.. జిల్లా వరకూ కొనసాగుతోంది. సరిగ్గా 15 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో బైకులపై ఆరుగురు వచ్చి ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి కర్నూలు మీదుగా జిల్లాకు మంగళవారం చేరుకున్నారు. ప్రధానంగా డబ్బు, బంగారం, పట్టుచీరలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. కళ్లెదుటే మద్యం సీసాలు కనపడ్డా.. కన్నెత్తి కూడా చూడకుండా తమ పని కానిచ్చేస్తుండటం గమనార్హం.

అంతేకాకుండా ఎక్కడా సీసీ కెమెరాకు కూడా చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. 15 రోజుల క్రితం వనపర్తిలో మొదలైన ఈ  వరుస దొంగతనాల వ్యవహారం కర్నూలు జిల్లాలోని గార్గేయపురం, పత్తికొండ ప్రాంతాల్లోని ఇళ్లలో లూటీ చేశారు. అక్కడి నుంచి జిల్లాలోకి మంగళవారం రాత్రి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అదే రోజు ఒకేసారి మూడు ప్రాంతాల్లో ఇళ్లతో పాటు ప్రభుత్వ మద్యం దుకాణంలో కూడా దొంగతనాలకు పాల్పడ్డారు.

బైకులపై వచ్చి.. : ఆరుగురు దొంగలు మూడు బైకులపై వస్తున్నారు. ఒకరు బైకు ఆన్‌ చేసుకుని సిద్ధంగా ఉంటుండగా.. మిగిలిన ఇద్దరు ఎవ్వరూ లేని ఇంట్లోకి వెళ్లి లూటీ చేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇళ్లకు వేసిన తాళాలను కట్టర్‌ ద్వారా కోసేసి సులువుగా ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో రాప్తాడు మండలంలోని రెండు గ్రామాల్లో ఆరు ఇళ్లతో పాటు ధర్మవరం మండలంలోని చిగిచెర్లలో రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. అంతేకాకుండా కందుకూరులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కూడా లక్షన్నరకు పైగా నగదును దోచుకెళ్లారు. ఈ మద్యం దుకాణంలో భారీగా మద్యం ఉన్నప్పటికీ కనీసం ఒక్క బాటిల్‌ కూడా తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ మద్యం దుకాణం ముందు ఉండాల్సిన సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో వీరి పని మరింత సులులైంది. మొత్తం నగదును క్యాష్‌చెస్ట్‌లో పెట్టకుండా డ్రాలో ఉంచడంతో వీరి పని సులువుగా ముగిసింది. దొంగలు సరిగ్గా సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకోవడం విస్తుగొలుపుతోంది. 

దర్యాప్తు చేస్తున్నాం.. 
జిల్లాలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు బైక్‌లపై ఆరుగురు తిరుగుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకున్నాం. దర్యాప్తు చేస్తున్నాం. కొద్దిరోజుల క్రితం కర్నూలులో కూడా దొంగతనాలు జరిగాయి. వారు, వీరు ఒకరేనా అనేది కూడా పరిశీలిస్తున్నాం. త్వరలో దొంగలను పట్టుకుంటాం. 
                – సత్యయేసు బాబు, జిల్లా ఎస్పీ   

మరిన్ని వార్తలు