జనసేన కార్యకర్తలుగా చెప్పుకుంటూ..

10 Mar, 2018 03:34 IST|Sakshi
ఏలూరులో నిందితులను అరెస్టు చూపిస్తున్న పశ్చిమ ఎస్పీ ఎం.రవిప్రకాష్, ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు

     జనసేన కార్యకర్తలుగా చెప్పుకుంటున్న నిందితులు

     సినీ హీరోలను పరిచయం చేస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వల

     పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి

     3.5 కిలోల బంగారం, కారు,రెండు బైక్‌లు స్వాధీనం  

ఏలూరు టౌన్‌: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మహిళలు, యువతులను మాయమాటలతో మోసగిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జనసేన కార్యకర్తలుగా చెప్పుకుంటున్న వీరు ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని వేధింపులకు పాల్పడుతుండేవారు. వీరి వేధింపులను భరించలేక ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ దర్యాప్తు చేపట్టి నిందితులైన ఏడుగురు యువకులను అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్పీ రవిప్రకాష్, ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావుతో కలిసి శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏలూరుకు చెందిన దత్తి బాలాజీ, సింహాద్రి బాలచందర్‌ అలియాస్‌ బాలు, పిళ్లా సాయి దేవేంద్రనాయుడు, విప్పర్తి ఫ్రాన్సిస్, కొండి రాజేష్, గుజ్జుల రాజీవ్, టి.అశోక్‌కుమార్‌లు గత కొంతకాలం నుంచి కొందరు యువతులను మాయమాటలతో ట్రాప్‌ చేసి భారీగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీస్‌ విచారణలో తేలింది.

జనసేన పార్టీ కార్యకర్తలుగా తిరుగుతూ యువతులను సినీ హీరోలకు పరిచయం చేయిస్తామని, ఫొటోలు తీయిస్తామంటూ మాయమాటలు చెప్పి స్నేహం చేసి అనంతరం బెదిరింపులకు పాల్పడుతూ బంగారు ఆభరణాలు, డబ్బు గుంజుతున్నారు. ఈనెల 4న ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బంగారు వ్యాపారి కుమార్తెను మోసం చేసి మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు తీసుకున్నారని ఫిర్యాదు వచ్చింది. దీనిపై ఎస్పీ రవిప్రకాష్‌ సమగ్ర విచారణ చేయాలని ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావును ఆదేశించారు.

ఈ యువకులు యూఏఈ ఎక్ఛేంజ్, ముత్తూట్, మణప్పురం, యాక్సిస్‌ బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి ఆ వచ్చిన సొమ్ముతో గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ క్యాసినోలలో రోలెట్, బ్లాక్‌జాక్, పోకర్, అందర్‌ బాహర్‌ వంటి విలాసవంతమైన జూదాలు ఆడుతుంటారు. లగ్జరీ కార్లు, మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేసి జల్సాలు చేయటం వీరి అలవాటు. వీరి నుంచి 3424 గ్రాముల బంగారు ఆభరణాలు, చవర్‌లెట్‌ కారు, రెండు ఖరీదైన మోటారు సైకిళ్లు, యాపిల్, సామ్‌సంగ్‌ కంపెనీ ఫోన్లు, ఏసీ, టీవీ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  

>
మరిన్ని వార్తలు