కొంప ముంచిన కట్టెల పొయ్యి

13 Nov, 2017 09:15 IST|Sakshi

గరికవలసలో అగ్ని ప్రమాదం

ఏడు పూరిళ్లు దగ్ధం

రూ.8లక్షల ఆస్తి నష్టం

బోరుమన్న బాధితులు  

గరికివలస గ్రామంలో రోజూలాగే గ్రామస్తులంతా పొలం పనులకు ఆదివారం ఉదయం వెళ్లిపోయారు. గ్రామంలో ఓ పూరింట్లో వెలిగించిన కట్టెల పొయ్యిను ఆర్పడం మరచిపోయారు. అది కాస్త గాలికి రాజి మంటలు చేలరేగాయి. దీంతో పొట్నూరు తవుడు ఇల్లు కాలిపోయింది. తరువాత పక్కన ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఏడు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.ఎనిమిది లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. జరిగిన సంఘటనతో బాధితులంతా గొల్లుమన్నారు.

గుర్ల: మండలంలోని గరికివలసలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు...గ్రామానికి చెందిన పొట్నూరు తవుడు ఇంట్లో ఉన్న కట్టెల పోయ్యి బొగ్గులు అర్పకుండా వదిలేశారు. గాలికి బొగ్గులు నిప్పు రాజుకోని ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. తరువాత మంటలు పక్కనే ఉన్న పొట్నూరు ఆదిలక్ష్మి, పొట్నూరు లక్ష్మి, పొట్నూరు పాపినాయుడు, పెనుమజ్జి పైడమ్మ, పొట్నూరు తవిటినాయుడు, పొట్నూరు పాపినాయుడు ఇళ్లకు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి. బాధితుల ఇళ్లల్లో సామగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. ప్రమాదంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు బోరుమన్నారు.  గ్రామంలో అందరూ పోలం పనులకు వెళ్లిన తర్వాత అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీ నష్టం జరిగింది.  విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ పి.ఆదిలక్ష్మి  సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వ పరంగా సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక నేత  బెల్లాన వెంకటరమణ, వీఆర్వో మీసాల చిన్నారావు ఉన్నారు.

పాతబగ్గాంలో...
గజపతినగరం రూరల్‌: మండలంలోని పాతబగ్గాం గ్రామానికి చెందిన లెంక అప్పయ్యమ్మ మిద్దె ఇల్లు ఆదివారం కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే...కార్తీక మాసం పూజలు చేస్తున్న సందర్భంగా పలువురు ఇంట్లో దీపాలు పెట్టడంతో ఆ దీపం ద్వారా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో లెంక అప్పయ్యమ్మ ఇంట్లో తినడానికి దాచుకున్న ధాన్యం, బట్టలు, తదితర వంట సామగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో బాధితురాలు కట్టుబట్టలతో మిగిలింది. ప్రమాదం జరిగినప్పుడు అప్పయ్యమ్మ వరి కోతలకు వెళ్లి పోయింది. ఆమె కుమార్తె వరలక్ష్మి ఇంటి వద్ద ఉంది. సంఘటన విషయాన్ని గజపతినగరం అగ్నిమాపక సిబ్బందికి తెలియజేసిన వెంటనే స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ మహేశ్వరరావు గ్రామానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. నష్టాన్ని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సంజీవరావు అంచనా వేశారు.  సర్పంచ్‌ లెంక పద్మావతి బాధితురాలిని పరామర్శించారు.

మరిన్ని వార్తలు