దీప్తిశ్రీ మృతదేహం లభ్యం

26 Nov, 2019 05:13 IST|Sakshi
చిన్నారి మృతదేహం ఉన్న మూట

కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సవతి తల్లి చేతిలో హత్యకు గురైన చిన్నారి దీప్తిశ్రీ ఐసాని (7) మృత దేహాన్ని పోలీసులు సోమవారం పంట కాలువ నుంచి వెలికి తీశారు. ఇంద్రపాలెం పంట కాలువ, ఉప్పుటేరు కలిసే చోట గుర్రపుడెక్కలో మృతదేహాన్ని కనుగొని ప్రత్యేక నావలో ఓ మూటలో గట్టుపైకి తెచ్చారు. ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, డీఎస్పీ కె. కుమార్‌ మృత దేహాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అస్మి మాట్లాడుతూ సవతి తల్లి శాంతికుమారియే చిన్నారిని కిడ్నాప్‌ చేసి ఇంటిలో హత్య చేసి షేర్‌ ఆటోలో తీసుకొచ్చి ఇంద్రపాలెం ఉప్పుటేరులో కలిసే పంటకాలువలో పడేసిందని తెలిపారు. సోమవారం ఉదయం నుంచి ఇంద్రపాలెం వంతెన సమీపంలో పోలీసులు, ధర్మాడి సత్యం బృందం ప్రత్యేక గాలింపు చేయడంతో మృతదేహాన్ని కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు.

కూతురిపై ప్రేమతో తనకు పుట్టిన బిడ్డను భర్త నిర్లక్ష్యం చేస్తాడన్న అనుమానంతో శాంతికుమారి ఈ ఘాతుకానికి పాల్పడిందని ఎస్పీ వివరించారు. ఇందులో శాంతికుమారి మినహా మరొకరి ప్రమేయం లేదని తెలిపారు. మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు