సెక్స్‌ ట్రేడ్‌ క్వీన్‌ అరెస్టు

25 Dec, 2017 11:33 IST|Sakshi
సెక్స్‌ ట్రేడ్‌ నిర్వహకురాలు సోనూ పుంజాబన్‌ అలియాస్‌ గీతా

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సెక్స్‌ ట్రేడ్‌ కేసులో నిర్దోషిగా బయటపడిన ‘సెక్స్‌ ట్రేడ్‌ క్వీన్‌’ గీతా అరోరా అలియాస్ సోనూ పుంజాబన్‌(36)ను ఢిల్లీ పోలీసులు పూర్తి ఆధారాలతో సహా మళ్లీ పట్టుకున్నారు. ఆమెపై పిల్లల అక్రమ రవాణా, శారీరక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. సోనూను ఆధారాలతో సహా పట్టుకునేందుకు పోలీసులు పడిన కష్టం అంతా ఇంతా కాదు.

సోనూ చేతిలో చిక్కి నరకం చూసిన ఓ టినేజర్‌ చేసిన సాయంతో పక్కా స్కెచ్‌ గీసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 2014లో సోనూ బందీ కోరల నుంచి తప్పించుకున్న టీనేజర్‌ నగరంలోని నజాఫ్‌ఘర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని తన గోడును వెళ్లబోసుకుంది. 2013లో తనను బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యభిచారం రొంపిలోకి దించారని చెప్పింది. బాధితురాలి చెప్పిన వివరాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు.

అయితే, కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పేందుకు బాధితురాలు రాకపోవడంతో కేసును క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు అప్పగించారు. 2014 నుంచి బాధితురాలి కోసం మొదలైన క్రైం బ్రాంచ్‌ పోలీసుల వేట నేటి వరకూ కొనసాగింది. బాధితురాలి ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆరు నెలల్లో ఆమె దొరికింది. కోర్టులో సాక్ష్యం చెబితే సోనూ తనను చంపేస్తుందని, అందుకే పారిపోయానని చెప్పింది. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారి కళ్లు గప్పి మళ్లీ తప్పించుకుంది.

దీంతో మళ్లీ ఆమె కోసం ముమ్మరంగా వెతుకులాట సాగించిన పోలీసులు ఢిల్లీలోనే పట్టుకున్నారు. పోలీసులు అండగా ఉంటారని, నిజాన్ని నిర్భయంగా వెల్లడించాలని ధైర్యం చెప్పారు. పోలీసుల అండంతో బయటకొచ్చిన బాధితురాలు సోనూ దురాగతాలను వెల్లడించారు. కేవలం సోనూ మాత్రమే కాకుండా మొత్తం 12 మంది తనను వేధించారని చెప్పారు.

లక్నో, రోహ్‌తక్‌లలో తనతో వ్యభిచారం చేయించారని తెలిపారు. కనీసం అన్నం కూడా పెట్టకుండా హింసించే వారని చెప్పారు. సోనూ తనను ఓ వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేసిందని తెలిపారు. అందంగా తయారు కావడం, కస్టమర్లుతో(విటులు) ఇంగ్లీష్‌ మాట్లాడటం వంటి విషయాలను సోనూ నేర్పించిందని చెప్పారు. విటుల వద్దకు పంపే ముందు సోనూ తనకు డ్రగ్స్‌ ఎక్కించేదని వివరించారు.

ఈ కేసులో సోనూతో పాటు చాలా మంది ఉన్నారని క్రైమ్‌ బ్రాంచ్‌ డీసీపీ భీష్మ సింగ్‌ తెలిపారు. నగరంలోని ఈ గ్యాంగ్‌ స్ధావరాలపై రైడింగ్‌లు జరుపుతున్నట్లు వెల్లడించారు. కాగా, 2011లోనే సోనూపై సెక్స్‌ ట్రేడ్‌ ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఆమెపై కేసు కూడా నమోదైంది. కానీ, 2014లో స్ధానిక కోర్టు ఆ కేసులో సోనూను నిర్దోషిగా ప్రకటించింది. సోనూను దోషిగా నిర్ధారించేందుకు బలమైన ఆధారాలు లేవని పేర్కొంది.    

మరిన్ని వార్తలు