బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకొని..!

26 Oct, 2019 08:04 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాద్‌  

సాక్షి, చీమకుర్తి: ముగ్గురు కలిసి బైకుపై ఓ బాలికపై వెంటపడ్డారు. వారి బైకు బాలిక సమీపానికి చేరుకోగానే నిందితుడికి సహకరించే వ్యూహంలో భాగంగా మిగిలిన ఇద్దరు వెళ్లిపోయారు. నిందితుడు మాయమాటలు చెప్పి బాలికను బైకుపై ఎక్కించుకున్నాడు. సంతనూతలపాడు జిల్లా పరిషత్‌ హైసూ్కల్‌ వెనుక ఉన్న పాత కొష్టాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు 13 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సంతనూతలపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గురువారం రాత్రి 9 గంటల సమయంలో సంతనూతలపాడులో జరిగింది. నిందితుడిపై ఫోక్సా చట్టం, 376 యాక్ట్‌ (లైంగిక దాడి, అపహరణ) నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే 7వ తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి 8 గంటల సమయంలో సంతనూతలపాడు గానుగపాలెంలోని తన స్నేహితురాలి వద్దకు పుస్తకాల కోసం వెళ్లి తిరిగి ఇంటికొస్తోంది. గమనించిన ముగ్గురు యువకులు బైకుపై బాలిక వెంటపడ్డారు.

బాలిక వద్దకు చేరగానే బైకుపై ఉన్న ఇద్దరు దిగి వెళ్లిపోయారు. బైకుపై ఉన్న 23 ఏళ్ల యువకుడు మాయమాటలతో బాలికను బైకుపై ఎక్కించుకున్నాడు. సమీపంలో నున్న సంతనూతలపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ వెనుక భాగంలో పొదలు, పాత కొష్టం ఉంటే దానిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంటికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లిదండ్రులకు చెప్పుకుని కన్నీటిపర్యంతమైంది. రాత్రి 10 గంటల సమయంలో బాలిక, తల్లిదండ్రులు కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం రిమ్స్‌కు తరలించారు.

శుక్రవారం విషయం తెలుసుకున్న డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, సీఐ పి.సుబ్బారావు, చీమకుర్తి టౌన్‌ ఎస్‌ఐ షేక్‌ రజియా సుల్తానాబేగం సంతనూతలపాడు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఘటన జరిగిన హైసూ్కల్‌ వెనుక ప్రాంతాన్ని డీఎస్పీతో పాటు ఇతర పోలీస్‌ అధికారులు పరిశీలించారు. వారితో పాటు సంతనూతలపాడు నియోజకవర్గంలోని జియో సిబ్బంది వచ్చి లైంగిక దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇంతలో బాలిక ఫిర్యాదు చేసిన అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై డీఎస్పీ ప్రసాద్‌ మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని,పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

మరిన్ని వార్తలు