పసిమొగ్గపై పైశాచికం

5 Jul, 2019 06:44 IST|Sakshi

ఐదేళ్ల బాలికపై మృగాడి క్రూరత్వం

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన  

పట్టుమని ఐదేళ్లు లేవు..  బడిబాటకు సిద్ధమవుతోంది. 
పలకాబలపం పట్టి అక్షరాలతో ఆడుకునే వేళ.. 
తెల్లారితే సరస్వతీమాత ఒడిలో అఆలు దిద్దాలి.. 
అమ్మానాన్న ఎవరి పనుల్లో వాళ్లు.. 
నానమ్మ పొరుగింట్లో..  అదను చూసుకుని ఇంట్లోకి  
చొరబడిందో మానవ మృగం..  ఆ పసిమొగ్గ వణికిపోయింది. 
ఎముకలు విరిగిపోయేంత బాధ.. 
అరిచేందుకూ వీల్లేకపోయింది. ఆ మృగాడి కామవాంఛ తీరింది. 
కడుపులో నొప్పి..  జననాంగంలో రక్తం.. 
అప్పుడే విధుల నుంచి ఇంటికి చేరుకున్న తల్లి.. 
గారాల బిడ్డకు ఏమైందోనని పరుగున ఆసుపత్రికి చేరుకుంది. 
జరిగిన ఘోరం తెలిసి కుప్పకూలింది. 
సమాజం సిగ్గుతో తలదించుకుంది.   

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: ఓ మానవమృగం పంజా విసిరింది. అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలికను చిదిమేసేంది. బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట నగరంలోని ఎర్రనేల కొట్టాలలో నివాసం ఉంటోంది. వీరికి నలుగురు ఆడపిల్లలు సంతానం. పెద్దపాప వయస్సు(8), రెండో పాప (5), మూడో పాప (3) మరో చిన్నారికి (10 నెలలు). కుటుంబ పోషణకోసం భర్త ఆటో తోలుతుండగా.. భార్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి ఇంటి పక్కనే కరియన్న అలియాస్‌ కిరణ్‌ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

దంపతులిద్దరూ ఎవరిపనులకు వారు వెళ్లగానే పిల్లలు వారి నానమ్మ వద్ద ఉండేవారు. బుధవారం వృద్ధురాలు వ్యక్తిగత పనిపై కాసేపు బయటకు వెళ్లగా పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇది గమనించిన కిరణ్‌.. ఇంట్లోకి చొరబడి ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. చిన్నారి అరవకుండా నోరు నొక్కేశాడు. అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. బాధతో చిన్నారి చాలా సేపు ఏడుస్తున్నా.. వృద్ధురాలు విషయం తెలుసుకోలేకపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన చిన్నారి తల్లి.. ఏడుస్తున్న పాపను ఆరా తీసింది. కడుపులో నొప్పి అని చెప్పడం, జననాంగం వద్ద రక్తం వస్తున్నట్లు గమనించి వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పరిశీలన అనంతరం జరిగిన విషయం తెలుసుకుని భర్తతో కలిసి వెళ్లి త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
నిందితునిపై పోక్సో యాక్టు 
ఫిర్యాదు అందగానే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకున్న సీఐ బాలమద్దిలేటి, ఎస్‌ఐ జైపాల్‌రెడ్డి నిందితునికి కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితున్ని అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ బాలమద్దిలేటి విలేకరులకు వివరించారు. నిందితునిపై పోక్సోయాక్టు కింద కేసు నమో దు చేసినట్లు వివరించారు.

నిందితునిది అండేపల్లి 
బాలికపై లైంగిక దాడి చేసిన కిరణ్‌ది కంబదూరు మండలం అండేపల్లి గ్రామం. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. తొలుత ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవలే డ్రైవర్‌ ఉద్యోగం మానేశాడు. ఇటీవల ఓ కుల సంఘం నాయకునిగా చలామణి అవుతూ కాలనీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.
 
చిన్నారికి ప్రత్యేక చికిత్స 
లైంగిక దాడికి గురైన చిన్నారికి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య చికిత్సలను అందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక వార్డులో అడ్మిట్‌ చేయించారు. పాప విషయాలను గోప్యంగా ఉంచారు.  ఐసీడీఎస్‌ పీడీ చిన్మయాదేవి ఆసుపత్రికి వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. నలుగురు ఆడసంతానం కావడంతో కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఇద్దరు పిల్లలకు బాలసదనంలో ఆశ్రయం కల్పించి విద్యాభ్యాసానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.   

మరిన్ని వార్తలు