బొయిపరిగుడలో బాలికపై లైంగిక దాడి 

28 Apr, 2018 13:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జయపురం : దేశంలో బాలికలపై అత్యాచారాలు రోజూ ఏదో ఒక చోట జరుగుతున్నట్టు  వార్తలు చూస్తున్నాం. లైంగికదాడులకు పాల్పడుతున్న వారిలో చిన్నారుల నుంచి రాజకీయ నేతలు, ఆధ్యాత్మిక గురువులు, పేరుగాంచిన వారు ఎందరో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ ఎమ్మెల్యే ఒక మహిళపై అత్యాచారం చేసిన సంఘటనలో అతడు జైలుకు వెళ్లాడు.

జమ్మూ–కశ్మీరులో ఒక బాలికపై జరిగిన అత్యాచారం దేశాన్నే కుదిపింది. రెండు దినాల కిందట ఆధ్యాత్మిక గురువుగా చెలామని అవుతున్న ఒక యోగికి అత్యాచారం కేసులో జీవిత కాల శిక్షపడింది. ఇవి కేవలం బాహ్య ప్రపంచానికి తెలిసిన విషయాలు. ఇక తెలియనివి బయటకు రానివీ ఎన్నో. కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ సమితి దసమంతపూర్‌ గ్రామ పంచాయతీలో ఒక వ్యక్తి వరుస అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.

గతంలో ఒక యువతిపై లైంగికదాడి చేసినా ఎటువంటి వ్యతిరేక చర్య లేక పోవటంతో, నేడు ఆ వ్యక్తి ఒక బాలికను ఎత్తుకుపోయి అత్యాచారం చేశాడు. అంతే కాదు, ఆ సమయంలో అక్కడకు వచ్చిన అతడి భార్యను చూచి అతడు పారిపోగా తన భర్తతో లైంగిక సంబంధం పెట్టుకుందన్న అపోహతో ఆమె బాధిత బాలికను  చితకబాదింది. చట్టం న్యాయంపై అవగాహన లేని బాధిత కుటుంబం గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయగా వారు నిందితుని కబురు చేయగా అతడు ఫరారీలో ఉండటంతో రాలేదు.

కొంతమంది పాత్రికేయులు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయమని బాధితురాలి కుటుంబానికి తెలపగా వారు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బొయిపరిగుడ సమితి దసమంతపూర్‌ గ్రామ పంచాయతీ బరువబాడి గ్రామంలో నివాసముంటున్న ఒక కొంద్‌ సాంప్రదాయ కుటుంబంలో 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయింది.

ఈ బాలిక ఇంటిలో పెద్దవారు పశులు మేపేందుకు సమీప అడవికి వెళ్లగా బాలిక మాత్రం ఇంటిలో ఉంది. ఆ బాలిక ఇంటి బయటన ఆడుకుంటున్న సమయంలో అదే గ్రామవాసి దేవ గదబ(25) అటుగా వచ్చి బాలికను పట్టుకున్నాడు. ఆమె కాలు చేతులు కట్టివేసి గుడ్డ కప్పి సమీప కొండ ప్రాంతానికి తీసుకుపోయి అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ సమయంలో భర్తను భోజనం కోసం పిలిచేందుకు గ్రామంలో వెతుకుతున్న అతడి భార్య కొండవైపు రాగా ఆమెను చూచి దేవ గదబ పరుగుతీసి మాయమయ్యాడు. అయితే ఏడుస్తున్న బాధిత బాలికను సముదాయించకుండా ఆ బాలికతో తన భర్తకు సంబంధం అంటగట్టి బాలికను తీవ్రంగా కొట్టంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులతో బాధిత బాలిక జరిగింది చెప్పి బావుర మంది.

బాలిక బంధువులు ఈ విషయం గ్రామ పెద్దలకు తెలుపగా వారు గురువారం గ్రామ సభను ఏర్పాటు చేశారు. అయితే నిందితుడు ఫరారీలో ఉండటంతో గ్రామ సభ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత బాలిక తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు.

ఇటువంటి అమానుష సంఘటనలు బహుళ ఆదవాసీ వెనుకబడిన ప్రాంతాలలో ఎన్ని జరుగుతున్నా అవి వెలుగు చూడటంలేదు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి దుశ్చర్యలకు సమాజంలో చెక్‌ చెప్పాలని పలువురు కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు