కోరిక తీరిస్తేనే కులధ్రువీకరణ  

14 Dec, 2017 13:44 IST|Sakshi

-బాలికలను వేధిస్తున్న ఆర్‌ఐ-బీడీఓకు బాధితుల ఫిర్యాదు 

సాక్షి, రాయగడ: రాయగడకు 140కిలోమీటర్ల దూరంలో గల మారుమూల చంద్రపూర్‌ సమితి తహసీల్‌ విభాగానికి  చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆగడాలు పెచ్చుమీరాయి. కులధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చే బాలికలను శారీరక కోరిక తీర్చాలని వేధిస్తున్నాడంటూ అభియోగాలు  వస్తున్నప్పటికీ తాను ఒడియా పత్రిక విలేకరిగా కూడా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ అభియోగాలను కప్పిపుచ్చుకుంటున్నాడు. దీనిపై ఈ నెల 12 వతేదీన ఇద్దరు ఆదివాసీ బాలికలు చంద్రపుర్‌ సమితి బీడీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రపుర్‌ సమితిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సుఖాంత్‌బెహరా వద్దకు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇద్దరు బాలికలు వెళ్లగా తన శారీరక కోరికను తీరిస్తే కుల ధ్రువీకరణ పత్రాలిస్తానని లేదంటే ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఆందోళన చెదిన వారు కలెక్టర్‌కు, బీడీఓకు, పోలీసు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  
గతంలో ఓసారి సస్పెన్షన్‌
సుఖాంత్‌ బెహరా గతంలో ఆదివాసీ కులధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసేందుకు ఒకొక్కంటికి రూ.20వేలు లంచం తీసుకుకుని మంజురు చేసేవాడన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇతర సాధారణ సర్టిఫికెట్లకు రూ.1000 నుంచి లంచాలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో పలుమార్లు మహిళలను వేధించిన విషయంలో అనేక ప్రాంతాల్లో అతనికి దేహశుద్ధి కూడా జరిగింది. గతంలో ఒకసారి ఈ ఘటనలపై విధుల నుంచి  సస్పెండ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆర్‌ఐ సుఖాంత్‌బెహరాపై విజిలెన్స్‌  విచారణ జరపాలని చంద్రపూర్‌ సమితి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు