ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు

7 Dec, 2019 09:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతానికి సంబంధించి శుక్రవారం షాద్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న షాద్‌ నగర్‌ ఏసీపీ వి.సురేంద్ర ఫిర్యాదు మేరకు హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్‌ 307) కింద కేసు నమోదు చేశారు. నిందితులను తీసుకుని నేర ఆధారాల సేకరణకు చటాన్‌పల్లిలోని ఘటనా స్థలానికి వెళ్లామని, అక్కడ నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ ఘటనలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌ గౌడ్‌ తీవ్రంగా గాయపడ్డారని, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు హతమైనట్లు వివరించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన షాద్‌ నగర్‌ పోలీసులు దాని ప్రతిని ఆధీకృత న్యాయస్థానానికి సమర్పించారు. మరోపక్క దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఓ సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర హోంశాఖకు పంపాయి.

చదవండి: ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌

కాగా గాయపడిన పోలీసులు హైటెక్‌సిటీలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేర్ హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ 'నిందితుల రాళ్ల దాడిలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తలకు గాయమైంది. కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్ కుడి భుజంపై కర్ర గాయాలయ్యాయి. ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని' తెలిపారు.

ఘటనా స్థలంలో బుల్లెట్ల కోసం వెతుకులాట
ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో పోలీసులు ఉపయోగించిన బుల్లెట్ల కోసం రెండోరోజు కూడా వెతుకులాడుతున్నారు. నలుగురు నిందితులకు 11 బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఘటన జరిగిన ప్రదేశంలో పడిన బుల్లెట్లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. డీప్‌ మెటల్‌ డిటెక్టర్‌తో బుల్లెట్ల కోసం బాంబ్‌ స్క్వాడ్‌ బృందం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. నిన్న రాత్రి నుంచి సంఘటనా స్థలంలో బుల్లెట్ల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు