లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఆర్‌ఐ

6 Jun, 2020 16:32 IST|Sakshi

బంజారాహిల్స్ ఎస్సైపైనా ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: రూ.15 లక్షల లంచం తీసుకుంటూ షేక్‌పేట్‌ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ నాగార్జున ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు యజమాని నుంచి ఆయన రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. బయానాగా రూ.15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఆర్‌ఐ నాగార్జునను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇదే స్థల వివాదంలో ఆర్‌ఐ నాగార్జునతో పాటు బంజారాహిల్స్ ఎస్సై రవీందర్‌ కూడా డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఎస్సై రవీందర్‌ను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఒకటిన్నర ఎకరాల స్థల వివాదంలో వీరిద్దరూ లంచాలు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. ఎస్సై రవీందర్‌పై ఆరోపణల నేపథ్యంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
(చదవండడి: జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా)

స్థల వివాదమిదే!
బంజారాహిల్స్‌లో సయ్యద్ అబ్దుల్‌కు చెందిన స్థలాన్ని ప్రభుత్వం రెవెన్యూ స్థలంగా పేర్కొంది. స్థలం తమదేనంటూ సయ్యద్ అబ్దుల్ కోర్టుకెక్కారు. స్థలం సయ్యద్ అబ్దుల్‌దేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ బోర్డు తీసి సయ్యద్ అబ్దుల్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు సయ్యద్ అబ్దుల్‌పై కేసు నమోదైంది. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్‌ఐ నాగార్జున, బంజారాహిల్స్‌ ఎస్సై రవీందర్‌ 50 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు