కథువా కేసు; షమీ భార్య షాకింగ్‌ కామెంట్స్‌

26 Apr, 2018 08:53 IST|Sakshi
హసిన్‌ జహాన్‌, షమీ (ఇన్‌సెట్‌లో కథువా బాధిత చిన్నారి)

కోల్‌కతా : టీమిండియా పేసర్‌ మహ‍్మద్‌ షమీ భార్య హసిన్‌ జహాన్‌ షాకింగ్‌ కామెంట్లు చేశారు. తన వ్యవహారాన్ని కథువా హత్యాచార ఘటనతో ఆమె పోల్చుకుంది. బుధవారం సాయంత్రం కథువా బాధిత చిన్నారి కోసం ఓ ఎన్జీవో నిర్వహించిన శాంతి ర్యాలీలో హసిన్‌ పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.  

‘కథువా కేసులో నిందితులు ఎంతటి వారైనా సరే శిక్ష పడాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా. ఒక రకంగా నేను కూడా కథువా తరహా బాధితురాలినే. కానీ, ఆ చిన్నారి చనిపోతే.. నేనింకా బతికున్నా. కథువా ఘటనలో ఏవేం జరిగాయో.. నాక్కూడా దాదాపు అలాంటి పరిస్థితులే  ఎదురయ్యాయి. నన్ను అత్యాచారం చేయాలని షమీ కుటుంబ సభ్యులు యత్నించారు. ఆపై చంపి నా శవాన్ని చెత్తకుప్పలో పడేయాలని వారు ప్రయత్నించారు. రెండు నెలలపాటు షమీ కుటుంబ సభ్యులతో పోరాడి నేను ప్రాణాలతో బతికి బయటపడ్డాను’ అని జహాన్‌ మీడియాతో తెలిపింది. 

కాగా, గతంలో భర్త షమీపై సంచలన ఆరోపణలు చేసిన జహాన్‌.. ఇప్పుడు చేసిన ఈ కామెంట్లు అతన్ని మరిన్ని చిక్కుల్లోని నెట్టేసేలా కనిపిస్తున్నాయి. ఇక గృహ హింస చట్టం కింద కేసు నమోదు కావటంతో షమీని, అతని సోదరుడిని ప్రశ్నించిన కోల్‌కతా పోలీసులు.. వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. షమీతోపాటు అతని సోదరుడు, తల్లి కూడా తనని హింసించి చంపాలని చూశారంటూ ఆరోపించిన ఆమె.. తనకు-కూతురి పోషణ కోసం భరణం కోరుతూ షమీపై ఆమె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు