రోమియోకు కటకటాలు!

4 Feb, 2020 10:16 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మహిళలు, యువతులకు ఎదురయ్యే వేధింపులను షీ–టీమ్స్‌ సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఓ రోడ్‌ సైడ్‌ రోమియోతో పాటు మరో పోకిరీని పట్టుకున్న షీ బృందాలు వారిని కోర్టులో హాజరుపరిచాయి. పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం వీరికి జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ షికా గోయల్‌ సోమవారం తెలిపారు. నిఘా విధుల్లో భాగంగా షీ–టీమ్స్‌ బృందాలు సంతోష్‌నగర్‌లోని ఓ జూనియర్‌ కాలేజీ వద్ద కాపుకాశాయి.

అదే సమయంలో రెయిన్‌బజార్‌ పరిధిలోని యాకత్‌పుర కాలనీకి చెందిన మహ్మద్‌ ఖాజా మొయినుద్దీన్‌ ఆతిఫ్‌ తన బైక్‌పై అక్కడికి వచ్చి పదేపదే ఆ కళాశాల వద్ద రౌండ్లు వేయడం మొదలెట్టాడు. దీనిని గుర్తిచిన షీ–టీమ్స్‌ అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల జైలు, రూ.200 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే ఓ మహిళను నేరుగా,ఫోన్‌ ద్వారా వేధిస్తున్న నాగోలు జైపురికాలనీకి చెందిన బి.వెంకటేష్‌ను సైతం షీ–టీమ్స్‌ పట్టుకున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచాయి. ఇతడికి న్యాయస్థానం ఐదు రోజుల జైలు, రూ.200 జరిమానా విధించింది.

మరిన్ని వార్తలు