రవిప్రకాశ్‌కు చుక్కెదురు 

25 May, 2019 02:54 IST|Sakshi

సైఫ్‌ మారిషస్‌ వివాదంలో ఆయన అభ్యంతరాలను తోసిపుచ్చిన ఎన్‌సీఎల్‌టీ

ఈ పిటిషన్‌తో రవిప్రకాశ్‌కు సంబంధం లేదని స్పష్టీకరణ

సైఫ్‌ మారిషస్‌ పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 టేకోవర్‌ విషయంలో సైఫ్‌ మారిషస్‌ కంపెనీ లిమిటెడ్‌–ఐ విజన్‌ మీడియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. కోర్టు వెలుపల ఈ రెండు కంపెనీలు రాజీ చేసుకోవడంతో ఐ విజన్‌పై సైఫ్‌ మారిషస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ఉపసంహరణకు హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ ) శుక్రవారం అనుమతిచ్చింది. ఈ పిటిషన్‌పై టీవీ9 మాజీ సీఈవో వి. రవిబాబు అలియాస్‌ రవిప్రకాశ్‌ చేసిన అభ్యంతరాలను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. రవిప్రకాశ్‌ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ అలందా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏబీసీఎల్‌)కు సంబంధించిన అంతర్గత వివాదాలని గుర్తుచేసింది. ఏబీసీఎల్‌ టేకోవర్, ఆ కంపెనీ నుంచి రవిప్రకాశ్, ఇతరులు డైరెక్టర్లుగా తొలగింపు తదితర వివాదాలను ఈ వ్యాజ్యంలో లేవనెత్తడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ వివాదాలు సైఫ్‌ మారిషస్‌ పిటిషన్‌ ఉపసంహరణను తిరస్కరించడానికి ఎంతమాత్రం కారణాలు కాజాలవని పేర్కొంది. ఈ అంశాలన్నింటిపై రవిప్రకాశ్‌ ఇప్పటికే ఇదే ట్రిబ్యునల్‌లో మరో పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపింది. ఆ పిటిషన్‌ విచారణపై జూన్‌ 12 వరకు స్టే విధిస్తూ ఢిల్లీలోని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుం టూ ఐ విజన్‌ మీడియాపై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సైఫ్‌ మారిషస్‌ కు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ట్రిబ్యునల్‌ సభ్యులు (జ్యూడీషియల్‌) కె.అనంత పద్మనాభస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇదీ సైఫ్‌–ఐ విజన్‌ మధ్య వివాదం... 
తమతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐ విజన్‌ వాటాల బదలాయింపు చేయలేదని, అదే విధంగా ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల మేరకు నడుచుకోలేదంటూ సైఫ్‌ మారిషస్‌ గత ఏడాది ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే, ఈ రెండు కంపెనీల మధ్య ట్రిబ్యునల్‌ వెలుపల రాజీ కుదిరింది. దీంతో ఐ విజన్‌ మీడియాపై తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరింది. అయితే దీనిపై రాతపూర్వకంగా పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సైఫ్‌ మారిషస్‌కు ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది. దీంతో సైఫ్‌ పిటిషన్‌ ఉపసంహరణ నిమిత్తం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇదే సమయంలో రంగ ప్రవేశం చేసిన రవిప్రకాశ్‌ సైఫ్‌ మారిషస్‌ పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించవద్దంటూ అభ్యంతరాలు లేవనెత్తారు. టీవీ 9లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ అందులో ప్రస్తావించారు. 

రవిప్రకాశ్‌ జోక్యంపై అభ్యంతరాలు... 
రవిప్రకాశ్‌ దాఖలు లేవనెత్తిన ఈ అభ్యంతరాలపై అటు సైఫ్‌ మారిషస్, ఐ విజన్‌ మీడియా, ఇటు ఏబీసీఎల్‌లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అసలు తమ మధ్య లావాదేవీల్లో రవిప్రకాశ్‌కు ఏమాత్రం సంబంధం లేదని తెలిపాయి. సంబంధం లేని వ్యక్తి లేవనెత్తే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. అందరి వాదనలు విన్న ట్రిబ్యునల్‌ సభ్యులు అనంత పద్మనాభస్వామి సైఫ్‌ మారిషస్‌ పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతిచ్చారు. చట్ట ప్రకారం పిటిషన్‌ను ఉపసంహరించుకునే హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. సైఫ్‌–ఐ విజన్‌లు రాజీకొచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సంబంధం లేని వ్యక్తి లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదని వీఎల్‌ఎస్‌ వర్సెస్‌ సౌత్‌ ఎండ్‌ ఇన్‌ఫ్రా కేసులో ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పును ఉదహరించారు.   

మరిన్ని వార్తలు