బర్త్‌డే.. బుల్లెట్స్‌

12 Nov, 2017 04:39 IST|Sakshi
జుబేర్‌ కార్యాలయం (ఇన్‌సెట్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముస్తఫా)

స్నేహితుడిని పార్టీకి పిలిచి రివాల్వర్‌తో కాల్పులు

మైలార్‌దేవ్‌పల్లి కింగ్స్‌ కాలనీలో ఘటన

ఐటీకి సమాచారమిచ్చాడన్న ఆగ్రహంతోనే దాడి!

అనంతరం ఆస్పత్రిలో చేర్చి పరారీ

నిందితుడు జుబేర్‌ ఎంఐఎం నేత షానవాజ్‌ తనయుడు

బాధితుడి శరీరం నుంచి బుల్లెట్‌ వెలికితీసిన వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లి కింగ్స్‌కాలనీ (శాస్త్రీపురం జిల్లెలగుట్ట)లో శనివారం తెల్లవారుజామున కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. తన వ్యాపారాలపై ఆదాయపన్ను శాఖకు సమాచారమిచ్చాడనే అనుమానంతో జుబేర్‌ అనే రియల్టర్‌ ముస్తఫా అనే తన స్నేహితుడిని తుపాకీతో కాల్చాడు. పుట్టినరోజు పార్టీకి పిలిచి.. ఆ పార్టీ అయిపోయిన తర్వాత తుపాకీతో రెండు రౌండ్లు కాల్చాడు. అనంతరం ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. కాల్పులు జరిపినట్లుగా భావిస్తున్న జుబేర్‌ ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఎంఐఎం నేత, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి షానవాజ్‌ కుమారుడు. వ్యాపార లావాదేవీలు, అప్పుల వివాదంతోపాటు ఐటీకి సమాచారమిచ్చాడనే అనుమానాలు ఈ కాల్పుల ఘటనకు కారణాలని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన అనంతరం గాలింపు చేపట్టిన పోలీసులు జుబేర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

పుట్టినరోజు పార్టీలో..
మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ముస్తాఫా (35). శుక్రవారం రాత్రి ఓ పుట్టినరోజు పార్టీ కోసం కింగ్స్‌కాలనీలోని తన స్నేహితుడు, వ్యాపారి జుబేర్‌ వద్దకు వచ్చారు. పార్టీ చేసుకున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ముస్తాఫాపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముస్తాఫా ఛాతీలో బుల్లెట్‌ దిగడంతో కుప్పకూలిపోయాడు. అనంతరం జుబేర్‌తో పాటు తోటి స్నేహితులు ఆయనను వెంటనే బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ముస్తాఫాకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఒక బుల్లెట్‌ను వెలికితీశారని మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌ వెల్లడించారు. ప్రస్తుతం ముస్తాఫా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కోలుకున్న తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కాల్పుల ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జుబేర్‌కు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు. అతడికి, ముస్తాఫాకు మధ్య రియల్‌ ఎస్టేట్‌ గొడవలు కూడా ఉన్నట్లు తెలిసింది. తనను జుబేర్‌ బెదిరిస్తున్నాడని గతంలోనే ముస్తాఫా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు. వారి మధ్య లావాదేవీలు, వివాదాలను తేల్చేందుకు శాస్త్రీపురం జిల్లెలగుట్ట (శాస్త్రీపురం గుట్ట)పై ఉన్న జుబేర్‌ రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంలో సోదాలు చేశారు. కింగ్స్‌ కాలనీ, శాస్త్రీపురం ప్రధాన రహదారి, జుబేర్‌ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. జుబేర్, ఆయన తండ్రి షానవాజ్‌లు ఇద్దరికీ లైసెన్స్‌ రివాల్వర్‌లు ఉన్నాయి. అయితే ముస్తాఫాపై కాల్పులు జరిపింది ఈ లైసెన్స్‌ రివాల్వర్‌తోనేనా..? ఇంకేదైనా రివాల్వర్‌తో కాల్పులు జరిపారా అన్నది తేల్చాల్సి ఉంది.

ఎవరీ జుబేర్, ముస్తాఫా?
ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఎంఐఎం నేత, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి షానవాజ్‌ కుమారుడు జుబేర్‌. జుబేర్‌ కూడా కొన్నేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఇక మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన ముస్తాఫా గతంలో చిన్నపాటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. తర్వాతి కాలంలో జుబేర్‌తో స్నేహం ఏర్పడింది. అనంతరం ముస్తాఫా కొంతకాలంలోనే పెద్ద రియల్టర్‌గా ఎదిగారు. అప్పటినుంచి జుబేర్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నాడని, ఆయన వ్యాపారాల్లో భాగస్వామిగా కూడా ఉన్నారని సమాచారం. అయితే కొంతకాలం కింద జుబేర్‌ కార్యాలయం, ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఐటీ శాఖకు సమాచారమిచ్చింది ముస్తాఫాయేనని జుబేర్‌ అనుమానించడంతో.. వారి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు