షైన్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిపై కేసు నమోదు

21 Oct, 2019 12:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అగ్నిప్రమాదం నేపథ్యంలో ఎల్బీనగర్‌లోని షైన్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం తెల్లవారుజామున నాలుగో అంతస్తులోని ఐసీయూలో అగ్నిప్రమాదంతో ఓ చిన్నారి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ చిన్నారుల్లో ముగ్గురిని ఉప్పల్‌ శ్రద్ధ ఆస్పత్రికి తరలించినా, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కూడా తరలించాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 42మంది చిన్నారులు ఉన్నారు. అయితే  ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్‌ సేఫ్టీ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయకుండానే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ ఆస్పత్రిని నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో 304A సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఆస్పత్రిని సీజ్‌ చేశారు. మరోవైపు వైద్యుడు సునీల్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

అలాగే ఆస్పత్రి యాజమాన్యం వైఖరికి నిరసనగా, బాధితులను ఆదుకోవాలంటూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఇవాళ తెల్లవారుజామున సంఘటన జరిగినా ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించకపోవడం దారుణమన్నారు. షైన్‌ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నేతలు, ఏబీవీపీ కార్యకర్తలు  ఎల్బీ నగర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చదవండిహైదరాబాద్‌లోని షైన్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

మరిన్ని వార్తలు