చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

22 Oct, 2019 01:45 IST|Sakshi
ఎల్‌బీ నగర్‌లో అగ్ని ప్రమాదం జరిగిన షైన్‌ ఆస్పత్రి భవనం

షైన్‌ ఆస్పత్రిలో షార్ట్‌సర్క్యూట్‌తో పేలిన ఇంక్యుబేటర్‌

ఒక శిశువు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం

మూడు రోజుల క్రితం కూడా షార్ట్‌సర్క్యూట్‌

తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టిన యాజమాన్యం

సాక్షి, హైదరాబాద్‌/నాగోలు:  షైన్‌ (ఎల్బీనగర్‌) ఆస్పత్రి యాజ మాన్య నిర్లక్ష్యం చికిత్స పొందుతున్న చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. సోమవారం తెల్లవారు జామున (2.45 గంటలకు) ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిమోనియాతో బాధపడుతూ ఇంక్యుబేటర్‌పై చికిత్స పొందుతున్న మూడు నెలల శిశువు మృతి చెందగా, మంటల్లో చిక్కుకుని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలకు తోడు దట్టమైన పొగలతో ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రస్తు తం ఇద్దరి శిశువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మరో 42 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎల్బీ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా డాక్టర్‌ వి. సునీల్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ సునీల్‌ పవార్‌ గత ఆరేళ్ల నుంచి షైన్‌ చిల్డ్రన్‌ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. సునీల్‌కుమార్‌రెడ్డి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2014లో రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నుంచి 20 పడకలకు అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం జనరల్‌ వార్డులో 50 పడకలు ఏర్పాటు చేశారు. నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించిన శిశువులతో పాటు, నిమోనియా, కామెర్లు ఇతర సమస్యలతో బాధపడుతున్న శిశువులను ఐసీయూలోని ఇంక్యుబేటర్‌లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

ఐసీయూలో మంటలు.. 
సోమవారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఐసీయూలో ఒక్కసారిగా మం టలు ఎగిసిపడ్డాయి. అక్కడే ఉన్న ఇంక్యుబేటర్లు షార్ట్‌సర్క్యూట్‌కు గురై వాటి లైట్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా దూపాడ గ్రామానికి చెందిన డి.నరేష్, మానసల కుమారుడు (3 నెలలు) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అలాగే నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన గిరి, మమతల కుమారుడు అవినాష్‌ (2 నెలలు)కి చాతి, కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. చిన్నారిని ఉప్పల్‌లోని శ్రీధ ఆస్పత్రికి తరలించారు. చంపాపేటకు చెందిన ముత్యాలు, సరితల 36 రోజుల శిశువును బంజారాహిల్స్‌లోని ఏవీఎస్‌ అంకుర ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా ఉరుమడ్లకు చెందిన నాగరాజు, సుగుణల 13 నెలల శిశువును ఎల్బీ నగర్‌లోని దిశ ఆస్పత్రికి, అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన మరో శిశువును మలక్‌పేటలోని సేఫ్‌ ఆస్పత్రికి తరలించారు.

ఓ చిన్నారిని మరో ఆస్పత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి...
అగ్ని ప్రమాదంతో ఐసీయూ సహా సాధారణ వార్డుల్లోనూ దట్టమైన పొగ అలముకోవడంతో పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పిల్లలకు సాయంగా వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు, నర్సులు, ఇతర సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. పిల్లల ఏడుపులు, సిబ్బంది ఉరుకులు పరుగులతో ఆస్పత్రిలో ఏం జరుగుతుందో అర్థం కాక తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన రహదారి వైపుగా ఉన్న అద్దాలను ధ్వంసం చేసి నిచ్చెన సాయంతో పిల్లలను సురక్షితంగా కిందికి దించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 42 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరందరినీ ఒకే ఆస్పత్రికి తరలిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన యాజమాన్యం పలు ఆస్పత్రులకు తరలించింది. మృతి చెందిన, ఆందోనకరంగా ఉన్న ఇద్దరు పిల్లల మినహా మిగతా చిన్నారులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన సమయంలో పిల్లల వైద్య ఖర్చలన్నీ తామే భరిస్తామని చెప్పిన షైన్‌ యాజమాన్యం ఆ తర్వాత వారిని గాలికొదిలేయడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మూడు రోజుల క్రితమే ప్రమాదం...
మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని ఐసీయూలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై రోగుల బంధువులు ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. నిర్వహకులు మాత్రం తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. పక్కా మరమ్మతులు చేసింటే ఈ పరిస్థితి ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అనుమతి ఎలా ఇచ్చారు..
200 గజాల స్థలంలో సెల్లార్‌ సహా జీ+3 అంతస్థుల్లో ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. పార్కింగ్, సెట్‌బ్యాక్‌ లేకుండా నిర్మించిన ఈ భవనానికి జీహెచ్‌ఎంసీ ఎలాంటి అనుమతులివ్వలేదు. ఏదైనా విపత్తులు సంభవిస్తే బయటికి వచ్చేందుకు సరైన దారి కూడా లేదు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు ఆస్పత్రిలో ఫైర్‌ సేఫ్టీ పరికరాలు లేవు. పార్కింగ్‌ కూడా లేని ఈ భవనానికి రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పెషాలిటీ హాస్పిటల్, డయాగ్నోస్టిక్స్‌ నిర్వహణకు అనుమతి ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకం. సామర్థ్యానికి మించి పడకలు ఏర్పాటు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. పార్కింగ్, ఇతర సమస్యలపై స్థానికులు జీహెచ్‌ఎంసీలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారే లేరు. 

ఎండీపై కేసు నమోదు...
ప్రమాద ఘటన తరువాత పోలీసులు ఆసుపత్రికి తాళాలు వేశారు. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. షైన్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ సునీల్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్‌పెక్టర్‌ అశోక్‌రెడ్డి తెలిపారు. 
 


 
 


 
 

మరిన్ని వార్తలు