షాకింగ్‌: అవినీతి వీడియో పోస్ట్‌చేసి.. ఆపై!

20 Oct, 2017 17:07 IST|Sakshi

అవినీతిని బయటపెట్టి ఎస్ఐ ఆత్మహత్యాయత్నం

ఉలిక్కిపడిన పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌.. విచారణకు ఆదేశాలు

చెన్నై : డిపార్ట్‌మెంట్‌లో అవినీతిని తట్టుకోలేక సోషల్ మీడియాలో బయటపెట్టిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.. అనూహ్యంగా వీడియో పోస్ట్‌ చేసిన కొన్ని క్షణాలకే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో తమిళనాడు పోలీస్‌ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం బాధిత ఎస్ఐ శ్రీకాంత్ కోయంబత్తూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

ఆ వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాంత్ జేశ్రీ తమిళనాడు ఫోర్త్‌ బెటాలియాన్‌ స్పెషల్ పోలీస్‌ ఫోర్స్‌లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం కోవైపుధుర్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. అయితే పోలీస్ శాఖలో అవినీతి తారాస్థాయికి చేరిందని, తాను కూడా బలవంతంగా కొన్ని లంచం ఫైళ్లపై బలవంతంగా సంతకాలు చేయాల్సి వచ్చిందని శ్రీకాంత్ ఫేస్‌బుక్‌ వీడియో ద్వారా ఆరోపించాడు. దీంతో ఆయనపై కక్ష్యగట్టిన పై అధికారి తనను 15వ బెటాలియన్‌కు బదిలీ చేయించారని.. అన్ని వివరాలు వీడియో ద్వారా పేర్కొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆ వీడియో ప్రకారం.. ‘రాష్ట్ర పోలీస్‌, రవాణా శాఖలలో అవినీతి రాజ్యమేలుతోంది. ఇటీవల ఓ సీనియర్‌ అధికారి సుబ్రమణి రూ.15 వేలు లంచం తీసుకునేందుకు నాపై ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా ఓ ఫైలుపై సంతకం చేయించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఫొటోల రూపంలో ఐజీగారికి పంపాను. కానీ నా ఫిర్యాదుపై ఎలాంటి విచారణ మొదలుపెట్టలేదు. పైగా నాపై బదిలీ వేటు వేశారు. నిజాయితీగా ఉండే తాను ఈ అవినీతిని భరించలేనని పేర్కొంటూ’  ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. అవినీతికి ప్రోత్సహిస్తూ టార్గెట్లు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతరం ఆత్మహత్య చేసుకునేందుకు ఏదో మిశ్రమాన్ని తాగాడు. గమనించిన స్థానికులు ఎస్ఐని ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ ఆత్మహత్యాయత్నం ఘటనతో నాలుక్కరుచుకున్న డిపార్ట్‌మెంట్ కేసు నమోదు చేసి పూర్తి ఘటనపై విచారణ చేపట్టింది.

మరిన్ని వార్తలు