కొడుకు జాడకై తండ్రిపై ఎస్‌ఐ దాడి

12 Apr, 2018 07:54 IST|Sakshi
ఎస్‌ఐ దాడిలో గాయపడిన కొండయ్య

తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో  చికిత్స పొందిన బాధితుడు

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సీపీఐ నేతలు

కందుకూరు: తన కుమారుడి కేసు విషయంలో తనని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లిన ఎస్‌ఐ అనవసరంగా దాడి చేసి గాయపరిచాడని కేసరిగుంట కాలనీకి చెందిన కొండయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండయ్య కుమారుడు మాలకొండయ్య ఇటీవల ఓ వివాహితను ఎటో తీసుకెళ్లాడు. ఆమె భర్త, బంధువులు స్థానిక పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ కేసు విషయమై నాలుగైదు రోజులుగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ క్రమంలో పట్టణ ఎస్‌ఐ వేమన లేకపోవడంతో రూరల్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌ కేసు విచారణ చేపట్టారు. మాలకొండయ్య ఆచూకీ తెలుసుకునేందుకు కొండయ్యను పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. నీ కుమారుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. తనకు తెలియదని కొండయ్య చెప్పడంతో ఆవేశానికి గురైన ఎస్‌ఐ.. కొండయ్యపై దాడి చేశాడు. ఈ దాడిలో కొండయ్య కన్నుకు గాయమైంది. ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో కంటికి చికిత్స చేయించుకున్నాడు. ఈ కేసు విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేకున్నా ఎస్‌ఐ కావాలనే దాడి చేశాడని విచారం వ్యక్తం చేశాడు.

సీపీఐ కార్యదర్శి మాలకొండయ్య, నాయకుడు పి.బాలకోటయ్య మాట్లాడుతూ ఎస్‌ఐ దురుసు ప్రవర్తన వల్లే కొండయ్యకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదన్నారు. కుమారుడిపై నమోదైన కేసులో ఎటువంటి సంబంధం లేని తండ్రిని తీసుకొచ్చి ఇష్టారీతిన ఎలా కొడతారని ప్రశ్నించారు. ఎస్‌ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డీజీపీ మన్నం మాలకొండయ్యతో పాటు, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ నాయకులు వలేటి రాఘవులు, బి.సురేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు