అవినీతి పాపం పండింది

19 Dec, 2019 12:22 IST|Sakshi
శ్రీసిటీ ఎస్సై సుబ్బారెడ్డిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు

నాలుగేళ్లుగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో తిష్ట

ప్రైవేట్‌ పంచాయితీలతో కేసుల రాజీ

సివిల్‌ కేసులో తలదూర్చి లంచం డిమాండ్‌     

ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు  

రూ.లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయిన శ్రీసిటీ ఎస్సై

నాలుగేళ్లుగా అక్కడే తిష్ట వేశాడు. ప్రతి వ్యవహారంలో తలదూర్చి ప్రైవేట్‌ పంచాయితీలు నెరుపుతున్నాడు. కేసులొస్తే.. కాసులు పుచ్చుకుని రాజీ చేసి పంపుతున్నాడు. రెండేళ్లుగా అవినీతి ఆరోపణలు వచ్చినా తన పలుకుబడి ఉపయోగించి సీటును పదిలం చేసుకున్నాడు. వెయ్యి గొడ్లను తిన్న రాబంధు.. ఒక్క గాలివానకు కూలినట్లు.. ఓ సివిల్‌ పంచాయితీతో అవినీతి పోలీస్‌ అధికారి పాపం పండింది. అక్షరాల రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయాడు.

సూళ్లూరుపేట/వరదయ్యపాళెం: ప్రపంచ స్థాయి పరిశ్రమలకు కేంద్రం శ్రీసిటీ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన హైటెక్‌ పోలీస్‌స్టేషన్‌ అవినీతికి కేరాఫ్‌గా మారింది. కాసులు ఇస్తే.. కేసులు మాఫీ అయిపోతున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా రాజీ మార్గంతో కేసులు సరిపుచ్చుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఇక్కడ పని చేసిన వారికి కాసుల పంట. ఇసుక,గ్రావెల్‌ తరలించడానికి ఇక్కడ భారీగా ముడుపులు అందుతున్నట్టు సమాచారం. టీడీపీ ప్రభుత్వంలో జిల్లా నుంచి ఇసుక, గ్రావెల్‌ తమిళనాడుకు భారీగా అక్రమ రవాణా జరిగేది. ఈ అక్రమ రవాణాకు ఒక్కో టిప్పర్‌ లారీకి నెలవారీ మామూళ్లు పెద్ద ఎత్తున అందుతున్నట్లు సమాచారం. పరిశ్రమల్లో తలెత్తే వివాదాల్లోనూ భారీగా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ సివిల్‌ పంచాయితీలో తలదూర్చి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఎస్సై సుబ్బారెడ్డి తీరు సంచలనం సృష్టించింది.  

సివిల్‌ పంచాయితీలో తల దూర్చి  
సూళ్లూరుపేట పట్టణంలో స్థిరపడిన ఎస్సై బీ సుబ్బారెడ్డి చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం శ్రీసిటీ సెజ్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఓ సివిల్‌ కేసులో ప్రత్యర్థిని వేధించి రూ.లక్ష  లంచం తీసుకుంటూ తిరుపతి ఏసీబీ ఆధికారులకు చిక్కాడు. అవినీతికి బాగా అలవాటు పడిపోయిన ఎస్సై పాపం ఎప్పుడు పండుతుందా అని స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో బుధవారం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం ట్రాప్‌ చేసి పట్టుకోవడంతో సర్వత్రా ఆనందం వెల్లివిరిసింది.  చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం చిలమత్తూరు గ్రామానికి చెందిన కే మస్తాన్‌నాయుడు సూళ్లూరుపేట పట్టణంలోని షార్‌ బస్టాండ్‌ సెంటర్‌లో మెడికల్‌ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి మత్తేరిమిట్ట, చిలమత్తూరు వద్ద కొంత పొలాలు ఉన్నాయి. అయితే మత్తేరిమిట్ట గ్రామానికి చెందిన శేషప్రియ అనే మహిళ తన భూములను అదే గ్రామానికి చెందిన వారు ఆక్రమించుకున్నారని, ఐదారు మందిపై నవంబర్‌ 3వ తేదీన శ్రీసిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఆ ఫిర్యాదులో మస్తాన్‌నాయుడు పేరు కూడా ఉంది. అయితే ఈ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని, బాధితురాలు శేషప్రియ ఇచ్చిన సర్వే నంబర్లకు తన భూములకు చెందిన సర్వే నంబర్లకు ఎలాంటి సంబంధం లేదని ఎస్సై సుబ్బారెడ్డికి అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను కూడా అందజేశాడు. సుమారు నెలల పాటు మిన్నకుండిపోయిన ఎస్సై ఈ నెల 3న మస్తాన్‌నాయుడుకు ఫోన్‌ చేసి నీపై కేసు ఉంది అరెస్ట్‌ చేయాలని బెదిరిస్తూ వచ్చాడు. 10వ తేదీన ఏకంగా సూళ్లూరుపేటలోని మెడికల్‌ షాపు వద్దకొచ్చి స్టేషన్‌కు వచ్చి మాట్లాడమని చెప్పి వెళ్లిపోయాడు. మస్తాన్‌ నాయుడు అదే రోజు శ్రీసిటీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా బేరం మాట్లాడారు. నీ అరెస్ట్‌ ఆపేసి కేసులో లేకుండా చేస్తాను రూ.5 లక్షలు ఇవ్వమని డిమాండ్‌ చేయడం, చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం సూళ్లూరుపేటలో డబ్బులు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో బా«ధితుడు  తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శ్రీసిటీ ఎస్సై సుబ్బారెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉండడంతో తిరుపతి ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌డీ శాంతో రూ.లక్ష (రూ.2వేలు నోట్లు) ఇచ్చి ట్రాప్‌ చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. బాధితుడు మస్తాన్‌నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సైను సస్పెండ్‌ చేసేందుకు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో తిరుపతి ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నాలుగేళ్లుగా శ్రీసిటీ హైటెక్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే..  
అవినీతి నిరోధకశాఖకు అడ్డంగా దొరికిన ఎస్సై సుబ్బారెడ్డి నాలుగేళ్ల క్రితం శ్రీసిటీ హైటెక్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఔట్‌పోస్టుగా ఉండి హైటెక్‌ పోలీస్‌స్టేషన్‌గా స్థాయి పెరిగిన నాటి నుంచి మొదటి ఎస్సైగా సుబ్బారెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రెండేళ్లుగా ఆయనపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనకున్న పలుకుబడితో నాలుగేళ్లుగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో కొనసాగాడు. ఆయన ధాటికి ఇక్కడ ఎస్సైలుగా వచ్చిన మరో ముగ్గురు కూడా అనధికారంగానే బదిలీ కావడం విశేషం.

మరిన్ని వార్తలు