ఎస్‌ఐ హనుమంతు..అవినీతి తంతు..

25 May, 2018 11:34 IST|Sakshi
ఎస్‌ఐ హనుమంతుతో వాదిస్తున్న మహబూబ్‌బాషా

బెట్టింగ్‌ కేసు లేకుండా చేసేందుకు రూ.1.5 లక్షలు డిమాండ్‌

మొత్తం తీసుకుని తిరిగి కేసు నమోదు చేసిన వైనం

జమ్మలమడుగు పట్టణ ఎస్‌ఐతో బాధితుడి వాగ్వాదం

అతను నేరాలను నియంత్రించాల్సిన బాధ్యత గల ఎస్‌ఐ.కానీ గతి తప్పారు. క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు లేకుండా చేసేందుకు డబ్బులు డిమాండ్‌ చేశారు. తమ కుమారుడిని వదిలేస్తారనే ఆశతో పాపం.. ఆ వృద్ధ తండ్రి అక్షరాలా లక్షా యాభై వేల రూపాయలు ముట్టజెప్పారు. తీరాచూస్తే కొడుకుపై కేసు నమోదు చేయడంతో ఆవేదనతో పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐని నిలదీశారు.

జమ్మలమడుగు రూరల్‌ : ‘లక్షాయాభైవేల రూపాయలు ఇస్తే.. నీ కొడుకుపై క్రికెట్‌ బెట్టింగ్‌ కేసు లేకుండా చేస్తానన్నాడు జమ్మలమడుగు పట్టణ ఎస్‌ఐ హనుమంతు. అడిగినంత మొత్తం తెచ్చి పోలీసు స్టేషన్‌లోనే ఎస్‌ఐ చేతిలో పెట్టా. డబ్బంతా దిగమింగి, ఇప్పుడు నా కుమారుడు అమీర్‌బాషాపై బెట్టిం గ్‌తో పాటు గంజాయి కేసు కూడా పెట్టారు. డబ్బు తిని ఇలా మోసం చేస్తే ఎలా’ చెప్పింది ఒకటి చేసింది ఒకటి అంటూ.. గురువారం అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో ఓ వ్యక్తి గగ్గోలుపెట్టాడు. వివరాలిలా ఉన్నాయి. క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారం మేర కు కొద్దిరోజులక్రితం నలుగురు బెట్టింగ్‌రాయుళ్లను జమ్మలమడుగు అర్బన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మైలవరం మండలం నవాబుపేటకి చెందిన అమీర్‌బాషా ఉన్నాడు.

అమీర్‌బాషా పేరును కేసులో లేకుండా చేస్తానని, అందుకు ప్రతి ఫలంగా రూ.1.5లక్షలు ఇవ్వాలని పోలీసులు డిమాండ్‌ చేసినట్లు అమీర్‌ బాషా తండ్రి మహబూబ్‌బాషా ఆరో పించారు. అడిగినంత డబ్బు ఇచ్చినా తన కుమారుడి పేరును కేసులో ఎందు కు పెట్టారన్నది బాషా వాదన. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం స్టేషన్‌లో ఎస్‌ఐ హనుమంతుకు, మహబూబ్‌ బాషాకు మధ్య తీవ్ర వాగ్వాదం జరి గింది. ‘కేసు లేకుండా చేస్తానంటే అక్షరాల రూ.లక్షా 50వేల నగదు తెచ్చి అధికారుల సమక్షంలో నీ చేతిలో పెట్టా.. డబ్బు ఇచ్చానని దేవుని వద్ద నేను ప్రమాణం చేస్తా.. తీసుకోలేదని నీవు ప్రమాణం చేస్తావా?’ అంటూ బాషా ఎస్‌ఐకి సవాలు విసిరారు. అయినా నీవు నాకు డబ్బు ఎందుకు ఇచ్చావు.. అంటూ ఎస్‌ఐ ఎదురుదాడి కి దిగారు. ఈ తతంగమంతా గురువారం ఉదయం పట్టణ పోలీసుస్టేషన్‌లో విలేకరుల ఎదుటే జరగడంతో నివ్వెరపోవడం పోలీసుల వంతైంది.

లాంటిదేమీ జరగలేదు..
నాకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. లోపాయికారి ఒప్పందాలు నేను అసలు చేయలేదు. మహబూబ్‌ బాషా మాటల్లో వీసమెత్తు కూడా నిజం లేదు. కేవలం అతని కుమారుడిని కేసులో పెట్టానని బాధతోనే అతను నాపై నింద వేస్తున్నాడు.– హనుమంతు, అర్బన్‌ ఎస్‌ఐ, జమ్మలమడుగు

మరిన్ని వార్తలు