ఎందుకలా? అన్నందుకే ఎస్‌ఐ దౌర్జన్యం..

25 Mar, 2018 11:33 IST|Sakshi

ప్రశ్నించినందుకే దళితుడిని చితకబాదిన ఎస్‌ఐ

సాక్షి, జమ్మలమడుగు : న్యాయాన్యాయాలు విచారించకుండానే ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించిన ఓ దళితుడిని ఎస్‌ఐ చితకబాదిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు... మైలవరం మండలం దొడియం గ్రామానికి చెందిన గుజ్జారి ప్రసాద్‌ తన ఇంటి ఆవరణలో అదనపు గది నిర్మించుకుంటున్నాడు. ఇందుకు అడ్డుగా ఉన్న పక్కింటి వారి చెట్టును ప్రసాద్‌ కొట్టేశాడు. దీంతో చెట్టు యజమాని సురేష్‌ మైలవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రసాద్‌ను స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి చేయి చేసుకున్నాడు.

ఇంటి నిర్మాణానికి చెట్టు అడ్డం వస్తుందని, దానిని తొలగించాలని పలు మార్లు వారికి విజ్ఞప్తి చేశానని, వారు పట్టించుకోకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో తానే కొట్టేశానని ప్రసాద్‌ వివరణ ఇస్తుండగానే.. ఎస్‌ఐ మళ్లీ కొట్టాడు. తన వాదన వినకుండానే ఎందుకు కొడుతున్నారని ప్రసాద్‌ ప్రశ్నించాడు. ఎస్‌ఐ దూషిస్తూ ప్రసాద్‌ను లాఠీ కర్రతో చితకబాదడంతో ప్రసాద్‌ తలకు గాయమైంది. బాధితుడిని బయటికి పంపించకుండా అక్కడే ఉంచారు. వెంట వచ్చిన ప్రసాద్‌ కుమారుడు సంజీవ్‌ను సైతం బయటికి పోనివ్వలేదు. రాత్రి అయినా వారిని స్టేషన్‌లోనే ఉంచారు. ఈ విషయంపై జమ్మలమడుగు రూరల్‌ సీఐ ఉమామహేశ్వరరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. విచారణ చేసి చర్యలు తీసుకుంటానని తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు