62 మంది విద్యార్థులకు అస్వస్థత

14 Jul, 2019 10:37 IST|Sakshi

సాక్షి, రాయచోటి(కడప) : రాయచోటిలోని ఏపీ గిరిజన సంక్షేమశాఖ వసతి గృహంలో 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కడపకు తరలించారు. శనివారం ఉదయం హాస్టల్‌లో అల్పాహారంగా ఇడ్లీ ..చట్నీ.. మజ్జిగ ఇచ్చారు. చట్నీలో విపరీతమైన కారమున్నట్లు తింటున్నప్పుడే విద్యార్థులు గమనించారు. మజ్జిగలో బ్లీచింగ్‌ ఎక్కువ శాతం కలిపిన నీటిని వినియోగించారని తెలుస్తోంది.

అల్పాహారం తిన్న విద్యార్థులకు వాంతులు, విరేచనాలు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు. బాధిత విద్యార్థులను ఉదయం 10 గంటలకు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితుల్లో తేడా రావడంతో వైద్యులు, అక్కడి వైద్య సిబ్బంది వేగవంతంగా చికిత్స అందించారు. కొంతమంది వెంటనే కుదుటపడ్డారు. కొందరు కోలుకుంటున్నారు. ఒకరిని కడప తరలించినట్లు తెలిసింది. రక్త నమూనాలను సేకరించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు మహేశ్వరరాజు, భాస్కర్‌రెడ్డి, నిస్సార్‌అహ్మద్, ఖదీర్‌బాషా, రియాజ్‌ తెలిపారు.

చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఆరా
వసతిగృహంలోని చిన్నారుల అస్వస్థతపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం కారణంగా చిన్నారులు అనారోగ్యం పాల్వవ్వడం తీవ్రంగా పరిగణించాలన్నారు.  వైద్యులు, వసతి గృహం అధికారులకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందివ్వాలని ఆసుపత్రి వైద్యులు మహేశ్వరరాజుకు సూచించారు. అవసరమైతే  తిరుపతి తరలించి చికిత్స చేయించాలని ఆదేశించారు. వసతిగృహం పరిస్థితులపై జిల్లా గిరిజన సంక్షేమాధికారి చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు.

వారం రోజులుగా కనిపించని వార్డెన్‌...
వసతి గృహంలో వార్డెన్‌ శ్రీనివాసులు వారం రోజులుగా రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. వచ్చినా ఏ మాత్రం పట్టించుకోరని, వంట మనుషులు ఇష్టమొచ్చిన రీతిలో తయారు చేసి వడ్డిస్తారని ఆరోపిస్తున్నారు. నీటిలో బ్లీచింగ్‌ ఎక్కువ కలవడంతోనే తాము అనారోగ్యం పాలు కావాల్సి వచ్చిందంటూ ఆవేదన చెందారు.

వసతిగృహాన్ని పర్యవేక్షిస్తున్న ఆశవర్కర్లు  అక్కడి పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.  నీటి తొట్లలో బల్లులు పడ్డాయని పలుమార్లు ఫిర్యాదులు చేస్తే తప్ప స్పందించడలేదని తెలిసింది. విద్యార్థుల అస్వస్థత విషయం తెలిసిన వెంటనే రాయచోటి అర్బన్‌ సీఐ రాజు, ఎస్‌ఐ రఫిక్, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులరెడ్డిలు ఆసుపత్రికి చేరుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.  

మరిన్ని వార్తలు