నిందితులకు శిక్ష పడే రేటు పెరిగేలా చూడాలి

10 Aug, 2019 12:58 IST|Sakshi
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జోయల్‌ డేవిస్‌

డాటా ఎంట్రీలో  తప్పులుండొద్దు, జాగ్రత్తలు అవసరం

పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌

సీసీటీఎన్‌ఎస్, కోర్టు మానిటర్‌ సిస్టంపై శిక్షణ

సాక్షి, సిద్దిపేట: క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం ద్వారా ఎంట్రీ చేసే డాటాలో తప్పులుండొద్దని పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ సూచించారు. శుక్రవారం కమిషనర్‌ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులకు సీసీటీఎన్‌ఎస్, కోర్టు మానిటర్‌ సిస్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎంట్రీ చేసిన డాటా దేశంలో ఎక్కడైనా.. ఏ అధికారి అయినా చూసుకునే అవకాశం ఉంటుందని, అందు కోసం కన్వెక్షన్‌(నిందుతులకు శిక్ష పడే రేటు) పెంచాలన్నారు.  దీని ద్వారా ప్రజల్లో డిపార్ట్‌మెంట్‌పై మంచి అభిప్రాయం కలుగుతుందని, అలాగే క్రైమ్‌ రేటు తగ్గుతుందని సూచించారు.

 ట్రయల్‌ నడిచే కేసుల్లో సాక్ష్యం ఎలా చెప్పాలో ముందే ప్రిపేర్‌ చేయాలని, కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. కమిషనరేట్‌ పరిధిలో సీఐలు, ఎస్‌ఐలు కొన్ని ముఖ్యమైన కేసులు అడాప్ట్‌ చేసుకోవడం జరిగిందని, ఆ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. సుప్రీం కోర్టు పోక్సో కేసులపై ఒక కమిటీ మానిటర్‌ చేస్తుందని, రాష్ట్రంలో ఉమెన్‌ ప్రొటెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు సీసీటీఎన్‌ఎస్‌ మానిటర్‌ చేస్తున్నారన్నారు. అందువల్ల డాటా ఎంట్రీ చేసేపుడు ఏలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు.

పోలీస స్టేషన్‌ల వారీగా యాక్టులో ఎన్ని కేసులు పెండింగ్‌ ఉన్నాయో త్వరలో లిస్ట్‌ అవుట్‌ చేసి పంపాలన్నారు. కోర్టు కానిస్టేబుల్‌ బాధ్యత చాలా కీలకమైనదని ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పటి నుంచి కేసు పూర్తయ్యేంతవరకు అవసరమైన పత్రాలు, సాక్షుల వాంగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో బాధ్యతగా ఉండాలన్నారు. కేసు ట్రయల్స్‌ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. కోర్టు విధులలో ప్రతిభ కనబర్చి నిందితులకు శిక్షలు పడేవిధంగా పనిచేసే సిబ్బందికి ప్రతినెల రివార్డులు అందజేస్తామన్నారు. సీసీటీఎన్‌ఎస్‌ కోర్టు మానిటర్‌ సిస్టంలో డాటా ఏ విధంగా ఏంట్రీ చేయాలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఐటీ కోర్స్‌ సిబ్బంది శ్రీధర్, స్వామిలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీసీటీఎస్‌ఎన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ హబీబ్‌ఖాన్, టాస్క్‌ఫోర్స్‌ సీఐ లక్ష్మణ్, కోర్టు లైజనింగ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ స్వామిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు