కల్తీ కేక్‌ తినడం వల్లే తండ్రీకొడుకులు మృతి

31 Jan, 2020 12:21 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: నాలుగు నెలల  క్రితం సిద్ధిపేట జిల్లాలో బర్త్‌డే కేక్‌ తిని ప్రాణాలు కోల్పోయిన తండ్రీకొడుకుల కేసులో మిస్టరీ వీడింది.  పాపమంతా కేకు తయారు చేసిన బేకరీ యజమానిదేనని తేలింది. కాలం చెల్లిన రసాయనాలతో కేకు తయారు చేయటం వల్లే తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్‌ పరీక్షలతో తేలింది. ఆస్తి తగాదాల కారణంగా బాబాయే కేకులో విషంపెట్టి చంపాడన్న ఆరోపణలు వాస్తవం కాదని తేలింది. (కేక్బాధితుల ఇంట మరో విషాదం)

ఐనాపూర్‌ ఘటనతో ఆందోళన..    
సిద్దిపేట అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ఇస్తారిగల్ల రవీందర్‌, అతని కుమారుడు రాంచరణ్‌ 2019 సెప్టెంబర్‌ 4వ తేదీన కేక్‌ తినడం వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో కొమురవెల్లి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేక్‌ నమూనాలను హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించడంతో అందులో ఎలాంటి విష ప్రయోగం జరగలేదని.. కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలు, రసాయానాలు వాడి ఎలాంటి శుభ్రత పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేసిన కేక్‌ తినడంతో వారిలో ఫంగస్, ఇన్‌ఫెక్షన్‌ సోకి శరీరంలో విష పదార్థంగా మారడంతో వారు చనిపోయారని పోలీసులు తెలిపారు. దీంతో సిద్దిపేటలోని బేకరీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన జిల్లా వాసులు జిల్లాలోని పలు హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీల్లో కల్తీ పదార్థాలతో తినుబండారాలు తయారు చేస్తున్నారని, కాలం చెల్లిన తర్వాత కూడా విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. (కేక్ ఆర్డర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త!)

శాంపిల్స్‌తోనే సరి..  
సిద్దిపేట  పాత బస్టాండ్‌ వద్ద ఉన్న ఒక హోటల్‌లో ఇడ్లీలో బొద్దింక వచ్చిందని వినియోగదారుడు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్‌ అధికారులు ఆ హోటల్‌ను సీజ్‌ చేశారు. కానీ మరుసటి రోజు నామమమాత్రం జరిమానాతో సరిపెట్టడంతో హోటల్‌ నిర్వాహకులు తిరిగి తమ వ్యాపారాన్ని ప్రారంభించారు.  కొన్ని హోటళ్లలో రాత్రి మిగిలిపోయిన మాంసం, ఇతర తినుబండారాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసి, మరుసటి రోజు మసాలాలు, పుడ్‌ కలర్స్, ఇతర రసాయానాలను వాడి గుర్తు పట్టలేకుండా ఘుమఘమలాడిస్తూ వినియోగదారులకు వడ్డిస్తున్నారు. వీటిని అడఫా దడఫా ఆహార భద్రతా అధికారి తనిఖీలు చేస్తున్నప్పటికీ శాంపిల్స్‌ సేకరణతోనే సరిపెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆడిందే ఆటగా సాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. (కల్తీ కేకులు.. 8 బేకరీలకు నోటీసులు)

197 శాంపిల్స్‌.. 27 కేసులు నమోదు.. 
జిల్లాలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌సెంటర్లు, బిర్యానీసెంటర్లు, పాల విక్రయకేంద్రాలు, సూపర్‌మార్కెట్లు, రోడ్డు పక్కన ఆహర పదార్థాలను విక్రమయించే బండ్లు, పండ్ల విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 2017 నుంచి 2019 డిసెంబర్‌ వరకు 179 ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.  ఆహార పదార్థాల విషయంలో కల్తీ జరిగిందని ఫలితాలు వచ్చిన రిపోర్టుల ఆధారంగా 27 కేసులు నమోదు చేశారు. ఇందులో 17 కేసుల్లో నిర్వాహకులకు రూ. 3,55,000  జరిమానా విధించారని అధికారులు చెబుతున్నారు. 

అయితే జిల్లా ఆహార భద్రతా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జిల్లాలో సక్రమంగా ఉండకపోవడంతోపాటు, ఎవ్వరో ఫిర్యాదు చేస్తే కానీ తనిఖీలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆహార భద్రతా అధికారులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు, తరుచూ తనిఖీలు నిర్వహించేలా ఆదేశించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవు.. 
జిల్లాలో ఆహార పదార్థాలను విక్రయించే వారు తప్పకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తే వారికి జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోటల్, బేకరీ, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, పండ్ల వ్యాపారులు తమ వ్యాపారాన్ని నిర్వహించాలి. గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.    –రవీందర్‌రావు, జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సిద్దిపేట
 

మరిన్ని వార్తలు