ధర్మారంలో అలజడి 

30 Jun, 2018 12:43 IST|Sakshi
పోలీసుల వాహనంలో సంతోష్‌

సొంత ఊరికి సంతోష్‌

ఇంట్లో పోలీసుల సోదాలు

మూడు వేల సిమ్‌కార్డులు స్వాధీనం?

ఎనిమిదిన్నర గంటల పాటు విచారణ

చూసేందుకు తరలివచ్చిన ప్రజానీకం

సాక్షి,పెద్దపల్లి/ధర్మారం: నకిలీ వేలిముద్రల తయారీ నిందితుడు పాత సంతోష్‌కుమార్‌ను తన సొంతగ్రామమైన ధర్మారంలో పోలీసులు విచారించారు. పోలీసు కస్టడీలో ఉన్న సంతోష్‌ను శుక్రవారం హైదరాబాద్‌ నుంచి జిల్లాలోని ధర్మారానికి తీసుకువచ్చారు. ధర్మారంలోని తన నివాసం,దుకాణంలో సంతోష్‌ సమక్షంలో క్రైమ్‌ స్పెషల్‌ బ్రాంచీ పోలీసులు, క్లూస్‌టీమ్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోష్‌ ఇల్లు, దుకాణాన్ని   క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు, వేలిముద్రల తయారీకి వినియోగించిన పరికరాలను స్వాధీనం చేసుకొన్నారు. సంతోష్‌ను తొలిసారిగా ధర్మారం తీసుకురావడంతో ఈ ప్రాంతంలో అలజడి నెలకొంది. ఎక్కడ చూసినా సంతోష్‌ చర్చ కొనసాగింది. ఆయనను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.

ధర్మారంలో ఎనిమిదిన్నర గంటలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీవేలిముద్రల తయారీ నిందితుడు పాతసంతోష్‌ అరెస్ట్‌ తర్వాత తొలిసారిగా తన స్వగ్రామం ధర్మారం తీసుకువచ్చారు.  హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఆర్‌ నగర్‌ ఎస్సై రాజేందర్‌గౌడ్, క్లూస్‌టీమ్‌ ఎస్సై బాల్‌రెడ్డిలు సంతోష్‌కుమార్‌తో పాటు సిబ్బంది ఉదయం 8.30 గంటలకే ధర్మారంలోని సంతోష్‌కుమార్‌ ఇంటికి చేరుకున్నారు.

ఇంటి తలుపులు మూసి ఉంచి దాదాపు గంట సేపు సోదాలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎస్సై దేవయ్య సహకారంతో సోదాల సమయంలో రెవెన్యూ సిబ్బంది పిలిపించుకున్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు రాంచంద్రం, భానుకుమార్‌ల సమక్షంలో తిరిగి తనిఖీలు కొనసాగించారు.

మధ్యాహ్నం 12 గంట వరకు ఇంటిలో సోదాలు నిర్వహించిన అనంతరం, మరో ప్రాంతంలో ఉన్న ఆయన దుకాణానికి తీసుకెళ్లారు. అక్కడ గంట పాటు సోదాచేశాక,« దర్మారం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి పంచనామా రాశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. 

మూడు వేల సిమ్‌కార్డులు లభ్యం?

సోదాల సందర్భంగా సంతోష్‌ ఇంట్లో మూడు వేల సిమ్‌కార్డులు, సగం కాల్చివేసిన సిమ్‌కార్డులు దొరికినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సంతోష్‌ ఇల్లు, దుకాణంలో సోదాలు నిర్వహించిన పోలీసులు నకిలీవేలిముద్రల తయారీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు.

బీరువాలో దాచి ఉంచిన డాక్యుమెంట్లను, కంప్యూటర్‌ హార్డు డిస్కు, కనెక్టర్, ప్రింటర్, కెమికల్‌ ఇంక్‌ప్యాడ్‌లను స్వాదీనం చేసుకున్నారు. ముందుగా ప్రింటర్‌ను రిపేర్‌ కోసం మేడారంలో ఇచ్చానని, సంతోష్‌ చెప్పటంతో పోలీసులు ఆయనను మేడారం తీసుకెళ్లారు. అక్కడ రిపేరుచేసే వ్యక్తి అందుబాటులో లేడు. మళ్లీ తన దుకాణంలోనే ఉండవచ్చని సంతోష్‌ చెప్పటంతో, దుకాణంలో తిరిగి సోదా చేయగా ప్రింటర్‌ లభించింది. 

తరలివచ్చిన ప్రజానీకం

సంతోష్‌ కుమార్‌ను పోలీసులు ధర్మారం తీసుకవచ్చారనే సమాచారంతో బంధువులు, మిత్రులు, స్థానిక ప్రజానీకం చూసేందుకు తరలివచ్చారు. సామాన్య వ్యాపారిగా ఉన్న వ్యక్తి దేశద్రోహస్థాయి నేరానికి పాల్పడినట్లు తేలడం జిల్లాలో సంచలనం సృష్టించింది. వేలిముద్రలే నకిలీవి తయారు చేసిన సంతోష్‌ ఇతనేనా అంటూ పరిశీలించి చూడడం కనిపించింది.

ఆయనను కలిసేందుకు బంధువులు, మిత్రులు ప్రయత్నించినప్పటికి పోలీసులు అనుమతివ్వలేదు. అయినా గంటల తరబడి ఆయన ఇంటి ముందు వేచి ఉన్నారు. చివరకు సంతోష్‌ను కారులో తరలిస్తున్న సమయంలో ప్రజానీకం ఆసక్తిగా గమనించారు.  

రహస్య విచారణ

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపడంతో పాటు, దేశవ్యాప్తంగా నిఘా వర్గాలు దృష్టిపెట్టిన కేసు కావడంతో పోలీసులు రహస్యంగా విచారణ కొనసాగించారు. సంతోష్‌ ఇల్లు,దుకాణంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మీడియాతో పాటు ఎవరినీ లోనికి అనుమతించలేదు. సోదాల అనంతరం సంతోష్‌కుమార్‌ను తీసుకవెళ్ళుతుండగా, ఫోటోలు తీసేందుకు సైతం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు