ఆ మూడూ హత్యలు చేసింది సింహాద్రినే!

7 Nov, 2019 10:25 IST|Sakshi
నిందితుడు సింహాద్రి; హత్యకు గురైన రామకృష్ణ పరమానంద స్వామీజీ (ఫైల్‌), కొత్తపల్లి నాగమణి (ఫైల్‌), శామంతకుర్తి నాగమణి (ఫైల్‌)

ఇద్దరు కుటుంబ సభ్యులు, స్వామీజీని హత్య చేసిన నిందితుడు 

సైనేడ్‌ కలిపిన ప్రసాదం తినిపించిన వైనం 

నగదు, బంగారం కోసం పన్నాగం

హతుశులైన బంధువులు 

ఇంతవరకు ఆ ముగ్గురు సాధారణంగానే మృతి చెందారని భావించారు. అయితే వారిలో ఒకరిది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరూ ఊహించన విధంగా ఆ ముగ్గురు హత్యకు గురయ్యారన్న విషయం తెలియగానే రాజమహేంద్రవరంలో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ముగ్గురిని హత్య చేసింది ఒక్కడే. వారిలో బంధువులైన ఇద్దరు మహిళలను.. ఆశ్రమం స్వామీజీని నిందితుడు హత్య చేశాడు. దీంతో బంధువులు బోరున విలపిస్తుంటే.. ఆశ్రమం పరిసర గ్రామాల వారు అవాక్కయారు. సంచలనం సృష్టించిన ఈ హత్యల ఉదంతం ఇలా ఉంది. 

సాక్షి, రాజమహేంద్రవరం: ఎవరికీ అనుమానం రాకుండా బంగారు వస్తువులు, నగదు చోరీకి పాల్పడుతూ నగరంలో మూడు హత్యలు చేసిన ఏలూరు మండలం వెంకటాపురానికి చెందిన వెల్లంకి సింహాద్రి పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకు చిక్కాడు. జిల్లాలో ఈ ముగ్గురిని హత్య చేసిన అతడు ఏమీ ఎరుగనట్టు వారి కుటుంబ సభ్యులతోనే తిరుగుతూ ఆ తర్వాత తప్పించుకోపోయాడు. చివరకు ఒక హత్య కేసులో దొరకడంతో డొంక కదిలింది. తాను చేసిన పది హత్యల్లో జిల్లాలో ముగ్గురుగు ఉన్నట్టు నిందితుడు అంగీకరించాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలోని రామకృష్ణానంద స్వామీజీ ఆశ్రమం నిర్వాహకుడు రామకృష్ణానంద స్వామి, రాజమహేంద్రవరం పేపరు మిల్లు ప్రాంతానికి చెందిన కొత్తపల్లి నాగమణి, బొమ్మూరు గ్రామానికి చెందిన శామంతకుర్తి నాగమణిలను నిందితుడు హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  

రియల్‌ ఎస్టేటు లాభసాటిగా లేదని.. 
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంత లాభసాటిగా లేదని, సులభంగా డబ్బు సంపాదించాలని సింహాద్రి ఆలోచనలో పడ్డాడు. రైస్‌ పుల్లింగ్‌ కాయిన్, రంగురాళ్లు ఇంట్లో ఉంటే కోటీశ్వరులు కావచ్చని, గుప్త నిధులు చూపిస్తానని, బంగారాన్ని రెట్టింపు చేస్తానని నమ్మించడం మొదలెట్టాడు. సైనేడ్‌ కలిపిన ప్రసాదం, ఆయుర్వేదం మందు ఇచ్చి.. 20 నెలల్లో పది మందిని హతమార్చాడు. ఏలూరుకు చెందిన పీఈటి కాటి నాగరాజు మృతితో భార్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏలూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేయడంతో జిల్లాకు చెందిన మూడు హత్యలు బయటపడ్డాయి. 

2018 ఏప్రిల్‌ 28న..  
సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో రామకృష్ణా పరమానంద స్వామీజీ ఆశ్రమంలోని రామకృష్ణానంద స్వామీజీ వద్దకు నిందితుడు భక్తుడిగా స్వామీజీతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. నిత్యాన్నదానం, పండగలకు హోమాలు స్వామీజీ చేస్తుంటే.. ఆయనతో ఉంటూ పరిసర ప్రాంతాల వారికి సుపరిచితుడయ్యాడు. స్వామీజీ వద్ద భారీగా సొమ్ము ఉంటుందని భావించి 2018 ఏప్రిల్‌ 28న ఆయుర్వేద మందులో సైనేడ్‌ కలిపి ఇచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన స్వామీజీ బస్టాండ్‌ వద్ద ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే స్వామీజీ మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందారనుకుని అందరూ భావించారు. ఆశ్రమంలోనే ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. స్వామిజీ వద్ద నగదు లేకపోవడంతో అతడు వెనుదిరిగాడు. సింహాద్రి పోలీసులకు చిక్కడంతో స్వామీజీ గుండెపోటుతో మరణించలేదని, హత్యకు గురయ్యాడని తెలియడంతో పురుషోత్తపట్నం తదితర ప్రాంతాల వారు ఆశ్చర్యపోతున్నారు. స్వామిజీని ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయం వరకు ఉన్న సింహాద్రి ఆ తరువాత కనిపించ లేదని స్థానికులు చెబుతున్నారు. స్వామీజీని హత్య చేశారన్న విషయాన్ని జీరి్ణంచుకోలేకపోతున్నామని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. 

2018 డిసెంబర్‌ 23న.. 
రాజమహేంద్రవరం పేపర్‌ మిల్లు క్వార్టర్స్‌లో ఉండే కొత్తపల్లి నాగమణికి సింహాద్రి సమీప బంధువు. చుట్టపు చూపుగా తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. 2018 డిసెంబర్‌ 23న డయోబెటిక్‌ మందు అంటూ ఆమెతో సైనేడ్‌ ఇవ్వడంతో ఆమె మృతి చెందింది. వెంటనే ఆమె మెడలోని బంగారు మంగళ సూత్రం తాడు తీసుకుని పరారయ్యాడు. ఆమెది అందరూ సహజ మరణంగా భావించారు. ఆమె దిన కార్యక్రమాల్లో ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే అతడు తిరిగాడు.  

ఈ ఏడాది జనవరి 12న.. 
కొత్తపల్లి నాగమణిని హత్య చేసిన కొద్దిరోజులకే ఆమె కోడలు, వరుసకు వదిన అయిన బొమ్మూరు గ్రామానికి చెందిన దెందులూరులో హెచ్‌వీగా పనిచేస్తున్న శామంతకుర్తి నాగమణి (50)ను డబ్బు రెట్టింపు చేస్తానని నమ్మించాడు. ఈ ఏడాది జనవరి 12న ఆమె ఆలమూరు వెళ్లి యేసురాజు అనే వ్యక్తిని చేబోదులుగా రూ.5 లక్షలు అడిగింది. మధ్యాహ్నం బ్యాంకులో బంగారం పెట్టి ఇస్తానని చెప్పి తీసుకువచ్చింది. మధ్యాహ్నం బొమ్మూరులోని ఇంటి వద్ద సింహాద్రి ప్రసాదం పేరుతో ఆమెకు సైనేడ్‌ తినిపించి, రూ.5 లక్షలు, బంగారు వస్తువులతో పరారయ్యాడు. బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనను అప్పుట్లో బొమ్మూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మర్నాడు సింహాద్రి పోస్టుమార్టం వద్దకు వచ్చి రూ.5 లక్షలు ఇచ్చిన యేసురాజుపై కేసు పెట్టేంచేలా ప్రయత్నాలు చేశాడు. కుటుంబ సభ్యులు సైతం అతనికి మద్దతుగా నిలిచారు. తల్లి నాగమణిని, భార్యను అతడు హత్య చేశాడని తెలుసుకున్న భర్త మాణిక్యాలరావు అవాక్కయ్యాడు. కుటుంబ సభ్యుడే ఇలా హత్యలకు పాల్పడడాన్ని వారు జీరి్ణంచుకోలేకపోతున్నారు.  బాధలో ఉన్న తమను ఇంక వదిలేయాలని ప్రాధేయపడ్డారు.   

మరిన్ని వార్తలు