సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

5 Feb, 2019 13:11 IST|Sakshi
అన్నపురెడ్డి జనార్దన్‌రెడ్డి (ఫైల్‌)

ఇష్టం లేని వివాహం చేశారని..!

కనుమలోపల్లె సమీపంలో రైలు కిందపడి బలవన్మరణం

కడప అర్బన్‌: రైలు కింద పడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. కడప– రాజంపేట రైలు మార్గం కనుమల్లోపల్లె సమీపంలో కిలోమీటర్‌ నంబర్‌ 253/1–2 మధ్యలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జనార్దన్‌రెడ్డి(28) సోమవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాలపడ్డాడు. కడప రైల్వే పోలీసులు, మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. బద్వేలు పరిధిలోని అయ్యవారుపల్లెకు చెందిన ముసల్‌రెడ్డి రెండో కుమారుడు అన్నపురెడ్డి జనార్దన్‌ రెడ్డి (28) సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. ఏడాదిన్నర క్రితం నెల్లూరుకు చెందిన ఓ మహిళతో  పెద్దల సమక్షంలో వివాహం నిర్వహించారు.

ఆమెను వివాహం చేసుకోవడం తనకు ఇష్టంలేదని పెద్దలకు చెప్పడంతో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో మళ్లీ ఉద్యోగరీత్యా సింగపూర్‌కు వెళ్లాడు. జనవరి నెలలో బద్వేల్‌కు వచ్చాడు. అనంతరం హైదరాబాద్‌లో స్నేహితుల రూంలో ఆశ్రయం పొందాడు. అక్కడే స్నేహితులకు, సోదరునికి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ‘సూసైడ్‌ నోట్‌’ను రాసి, ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. స్నేహితులు కనిపెట్టడం, బద్వేల్‌లో వారి తల్లిదండ్రులకు తెలపడం, సనత్‌నగర్‌ పోలీసులు సెల్‌ఫోన్‌ టవర్‌ ఆధారంగా అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరిగి తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఇంటికి వచ్చిన జనార్దన్‌ రెడ్డి సోమవారం ఇంటిలో చెప్పకుండా కడపకు బయలుదేరి వెళ్లాడు. కనుమలోపల్లె సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శరీరం ఛిద్రమైంది. మృతదేహాన్ని కడప రిమ్స్‌ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం రైల్వే పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రైల్వేహెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజునాయక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్‌రెడ్డి మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.

మరిన్ని వార్తలు