మహిళ దారుణ హత్య

7 Sep, 2018 14:06 IST|Sakshi
కారుమూరి అంజలి దేవి(ఫైల్‌), రోధిస్తున్న మృతురాలి కుమారుడు, మనవరాలు

ఒంటరి మహిళ దారుణ హత్య

17 కాసుల బంగారం, నగదు మాయం

భర్త చనిపోయి ఇంటిలో ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన పాయకాపురంలో గురువారం చోటుచేసుకుంది. 

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ సెంట్రల్‌): భర్త చనిపోయి ఇంటిలో ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన పాయకాపురంలో గురువారం చోటుచేసుకుంది. నున్న రూరల్‌ పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల ప్రకారం పాయకాపురం పెట్రోల్‌బంకు పక్క రోడ్డుకు చెందిన కారుమూరి అంజలి దేవి(52)కి ఒక కూతురు, ఒక కొడుకు సంతానం ఉన్నారు. భర్త కొన్నేళ్ల క్రితం చనిపోగా, పిల్లలిద్దరికి పెళ్లిళ్లు చేసి సమీపంలోనే వారికి రెండు ఇళ్లు ఇవ్వడంతో అప్పటినుంచి వారు వేరుగా ఉంటున్నారు. తనకున్న రెండంతస్తుల భవనంలో కింది గదులను అద్దెలకు ఇచ్చి భవనం పైభాగంలో ఆమె ఒక్కతే నివసిస్తుంది. అయితే బుధవారం రాత్రి ఇంటిపక్కన వారితో మాట్లాడి టీవీ చూసి నిద్రపోతానంటూ ఇంటిలోకి వెళ్లిపోయింది. అయితే గురువారం మధ్యాహ్నం అయినా కూడా ఆమె గదిలో నుంచి బయటకు రాకపోవడం, ఎంత పిలిచినా పలుకకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కన అద్దెకుంటున్న వారు తలుపులు పగలకొట్టి చూడగా ఇంటిలోని మంచంపై ఆమె విగతజీవిగా మారి కనిపించింది. బీరువాలోని దుస్తులన్నీ కిందపడేసి ఉండడం, ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురై ఉండడంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం అందించారు.

పాతనేరస్తులా.. తెలిసినవారి పనా..?
సమాచారం అందుకున్న నున్న రూరల్‌ పోలీసులు, క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలు, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. బీరువాలో పెట్టిన 17 కాసుల బంగారం, కొంత నగదుతో పాటు మృతురాలి ఫోను కూడా మాయం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పాతనేరస్తులు చేసిన పనా, లేక ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ
మహిళ హత్య విషయాన్ని తెలుసుకున్న డీసీపీ నవాబ్‌జాన్, నార్త్‌ జోన్‌ ఏసీపీ శ్రావణిలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి వివరాలు అడిగి తెలుసుకొని హత్యకు కారణాలపై సిబ్బందిని, స్థానిక ప్రజలను ఆరా తీశారు. హత్యకు కారణాలు తెలుసుకుంటున్నామని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీఐ ఎంవీ దుర్గారావు తెలిపారు.

మరిన్ని వార్తలు