నిందితుడిని ఉరితీయాలి

12 May, 2018 10:03 IST|Sakshi
శిరీష మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు, శిరీష(ఫైల్‌)

శిరీష కుటుంబ సభ్యుల డిమాండ్‌

కుమ్మరిగూడలో విషాదఛాయలు

పూర్తయిన విద్యార్థిని శిరీష అంత్యక్రియలు

వారిద్దరికీ ఇంటర్మీడియట్‌ చదివే సమయంలో పరిచయం ఏర్పడింది. తెలిసి తెలియని వయస్సులో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. స్నేహం ముసుగులో ఉన్మాదిగా మారిన ఓ యువకుడు తోటి స్నేహితురాలిని నమ్మించి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన కొత్తూరు పంచాయతీ కుమ్మరిగూడలో శుక్రవారం చోటు చేసుకుంది.

రంగారెడ్డి, కొత్తూరు : స్థానికులు, హత్యకు గురైన విద్యార్థి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు పంచాయతీ పరిధిలోని కుమ్మరిగూడ గ్రామానికి చెందిన ఈశ్వర్, పద్మమ్మ దంపతుల కుమార్తె శిరీష(21). దిల్‌సుఖ్‌నగర్‌లోని అనిబిసెంట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతూ బ్యాంక్‌ ఉద్యోగం కోసం అక్కడే ఓ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకుంటుంది. కాగా శిరీష ఇంటర్మీడియట్‌ చదివే సమయంలో తిమ్మాపూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి నిత్యం కళాశాలకు వెళ్లేది. ఈ క్రమంలో తిమ్మాపూర్‌ రైల్వేస్టేషన్‌ కాలనీకి చెందిన సాయిప్రసాద్‌తో స్నేహం ఏర్పడింది. క్రమంగా అతడి ప్రవర్తన హద్దు మీరడంతో శిరీష విషయాన్ని కుటుంబ సభ్యులు తెలపడంతో వారు అతడ్ని మందలించారు.

చాలా కాలం పాటు శిరీష జోలికెళ్లని సాయిప్రసాద్‌ గురువారం తాను దిల్‌సుఖ్‌నగర్‌లోని కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లినట్లు తెలుసుకొని అక్కడి నుంచి మాటల్లో పెట్టి తనను శంకర్‌పల్లిలోని ప్రగతి రిసార్ట్‌ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. అనంతరం శిరీష మొఖం కడుకునేందుకు సబ్బు రాసుకునే సమయంలో పథకం ప్రకారం.. తనను హత్య చేయాలని అనుకున్న సాయిప్రసాద్‌ కత్తితో గొంతు కోశాడు. రక్తపు మడుగులో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. సాయంత్రం అవుతున్నా కూతురు ఇంటికి రాకపోయే సరికి ఆమెకు తండ్రి ఫోన్‌ చేయడంతో స్విచ్చాఫ్‌ వచ్చింది. తీరా రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ నుంచి ఫోన్‌చేసి శిరీష ప్రగతి రిసార్ట్స్‌లో హత్యకు గురైనట్లు తెలపడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. 

బహిరంగంగా ఉరితీయాలి...  
తమ కూతురు చదువుల్లో ఎప్పుడు ఫస్ట్‌గా ఉండడంతో పాటు కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా ఉండేదని శిరీష తల్లి పద్మమ్మ బంధువులతో చెబుతూ కన్నీంటి పర్యంతమయ్యారు. పథకం ప్రకారమే సాయి ప్రసాద్‌ తమ కూతుర్ని హత్య చేసినట్లు వాపోయారు. మరోమారు ఆడపిల్లలపై ఇలాంటి ఘోరాలకు పాల్పడకుండా ప్రభుత్వం సాయిప్రసాద్‌ను బహిరంగంగా ఉరితీయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్‌ చేశారు. చదువు కోసం ఇంటి నుంచి వెళ్లిన కుమార్తె శవమై రావడంతో కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం గ్రామానికి చేరుకున్న విద్యార్థిని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా