పులగంపల్లిలో విషాదం

20 Jan, 2020 07:57 IST|Sakshi

 ప్రమాదవశాత్తు నీటమునిగి ఇద్దరు బాలికలు

ఒకరి మృతదేహం వెలికితీత..  మరొకరు గల్లంతు

అనంతపురం, నల్లమాడ: హంద్రీ–నీవా కాలువలోకి దిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ఒకరి మృతదేహం వెలికితీయగా.. మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటనతో స్వగ్రామం పులగంపల్లిలో విషాదం అలుముకుంది. నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన హైదర్‌వలి పెయింటర్‌. ఇతనికి భార్య ఫక్రున్నిసా, కుమార్తెలు నాజిరా (13), నూహిరా (11) ఉన్నారు. స్వగ్రామంలో పని లేకపోవడంతో హైదర్‌వలి కుటుంబాన్ని కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి హామాలీ క్వాటర్స్‌కు మకాం మార్చాడు. ఆదివారం కదిరి రూరల్‌ మండలం చెర్లోపల్లి రిజర్వాయర్‌ వద్దకు విహారయాత్రకు వెళ్దామని నాజిరా, నూహిరా పట్టుబట్టారు. ఇవాళ వద్దులే అని తండ్రి వారించినా వినలేదు.

దీంతో తల్లి, అమ్మమ్మ, బంధువులతో కలిసి ఆటోలో రిజర్వాయర్‌ వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం అందరూ కలసి భోజనం చేశారు. అందరికన్నా ముందుగా భోజనం చేసిన అక్కాచెల్లెల్లు నాజిరా, నూహిరాలు హంద్రీ–నీవా కాలువ నీటిలోకి దిగారు. లోతుపై అవగాహన లేని వీరు కొంతదూరం పోయాక నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. తల్లి, బంధువులు గట్టిగా కేకలు వేసి స్థానికుల సాయంతో గాలింపు చేపట్టి నూహిరాను ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే నూహిరా చనిపోయింది. నాజిరా జాడ కానరాలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఈతగాళ్లను రంగంలోకి దింపి నాజిరా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలియగానే పులగంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేవుడు ఎంత పనిచేశాడంటూ నిట్టూర్చారు. సమాచారం తెలియగానేతెలిసిన వెంటనే వైఎస్సార్‌ సీపీ నాయకులు, మాజీ సర్పంచ్‌ కే.రవిచంద్రారెడ్డి, పక్కీరప్ప, వీఆర్‌ఓ ముబారక్‌ తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. 

నూహిరా మృతదేహం వద్ద తల్లి రోదన
గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం గుర్తింపు
ఉరవకొండ రూరల్‌: విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. పెన్నహోబిలం జలపాతంలో కొట్టుకుపోయిన ఇద్దరిలో ఒకరి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గుంతకల్లులోని వాల్మీకి సర్కిల్‌లో నివాసముంటున్న హనుమంతు (35), అల్లుడు సాయికృష్ణ (11)లు శనివారం జలపాతంలోకి సరదాగా దిగినపుడు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయారు. ఆ రోజు సాయంత్రం చీకటి పడేవరకు గాలించినా జాడ కనిపించలేదు. ఆదివారం ఉదయం ఎస్‌ఐ ధరణిబాబు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా.. హనుమంతు మృతదేహం కాలువ గట్టున గడ్డిలో ఇరుక్కుని ఉండటం గుర్తించి బయటకు తీశారు. ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గల్లంతైన సాయికృష్ణ ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు