టెక్కీ అజితాబ్‌ ఆచూకీ చెబితే రూ. 10 లక్షలు

10 May, 2018 09:38 IST|Sakshi
అజితాబ్‌ కుమార్‌ సిన్హా (ఫైల్‌)

సాక్షి, బెంగళూరు: కొన్ని నెలల క్రితం అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ టెక్కీ కుమార్‌ అజితాబ్‌ ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని సీఐడీ అధికారులు ప్రకటించారు. గతేడాది డిసెంబర్‌ 18న ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టిన తన కారును కొనుగోలుదారుడికి అమ్మేందుకు బయటకు వెళ్లిన అజితాబ్‌ అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అజితాబ్‌ అదృశ్యంపై వైట్‌ఫీల్డ్‌లో కేసు నమోదైంది. కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అతని తండ్రి అశోక్‌కుమార్‌ సిన్హా హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో హైకోర్టు సిట్‌ దర్యాప్తునకు నగర కమిషనర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కూడా ఎంత విచారించినా, సుదీర్ఘంగా గాలించిన అజితాబ్‌ ఆచూకీ లభించలేదు. ఐదు నెలలు గడుస్తున్నా అజితాబ్‌ ఆచూకీ పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సీఐడీ ఈ కేసును స్వీకరించి దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో అజితాబ్‌ ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేసింది. అజితాబ్‌ ఆచూకీ తెలిసిన వారు సీఐడీ కంట్రోల్‌ రూమ్‌ 080–2204498, 22942444 ఫోన్‌ నంబర్లకు సమాచారం అందజేయాలని సూచించింది.  

మరిన్ని వార్తలు