శ్రావణి హత్య.. పోలీసుల కీలక నిర్ణయం!

28 Apr, 2019 12:21 IST|Sakshi

దర్యాప్తు కోసం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఏర్పాటు

సమాచారం ఏదైనా ఉంటే 9490617111కు తెలియజేయాలని సీపీ విజ్ఞప్తి

సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో జరిగిన శ్రావణి దారుణ హత్య తీవ్ర సంచలనం రేపుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడి తర్వాత హత్య చేసినట్లుగా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు శ్రావణిని హత్య చేసింది ఎవరు? బావిలో పడేసి పూడ్చిపెట్టడం ఒక్కరి వల్ల అయ్యే పనేనా? ఈ దారుణానికి ఒడిగట్టడానికి వెనుక కారణాలేంటి అన్నది ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంంలో ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను ఏర్పాటుచేసినట్టు రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. కేసు దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించిన బొమ్మలరామారం ఎస్సై వెంకటేశ్‌పై శాఖపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. శ్రావణి హత్యకు సంబంధించి గ్రామస్తుల వద్ద ఏదైనా సమాచారం ఉంటే నేరుగా రాచకొండ పోలీసుల వాట్సాప్‌ నంబర్‌ 9490617111 సమాచారం ఇవ్వచ్చునని తెలిపారు. కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఎస్‌వోటీ డీసీపీ సురేందర్ రెడ్డి, షీ టీమ్‌ అడిషనల్ డీసీపీ సలీమా, ఐటీ సెల్ అధికారులు ఉంటారని తెలిపారు.

శ్రావణి పోస్ట్‌మార్టం అనంతరం ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. శ్రావణి ఊపిరాడక చనిపోయిందని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని తేలింది. దీంతోపాటు ఆమె ఎడమవైపు పక్కటెముకలు విరిగిపోయాయి. కుడివైపుపక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను చంపిన తర్వాత 25 అడుగుల లోతులోని బావిలోకి పైనుంచి పడేయడంతో పక్కటెముకలు విరిగినట్లు తెలుస్తోంది. శ్రావణి మృతదేహం దొరికిన బావి వద్ద ఎండిన వరిగడ్డిని గుర్తించారు.  బాలిక చనిపోయిన తర్వాత కాల్చివేయాలన్న ఆలోచనలో నిందితులు ఉన్నట్లు భావిస్తున్నారు. శ్రావణి హత్య సంఘటనపై ఆమె బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాంలో ఉన్నారు. శనివారం కూడా శ్రావణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన కోసం వెళ్తూ జాతీయ రహదారిపై మరోసారి రాస్తారోకో చేపట్టారు. ప్రజల ఆగ్రహంతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. సీపీ మహేశ్‌భగవత్‌ సంఘటన స్థలానికి చేరుకుని నిందితులను 24 గంటల్లో పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తానని హామీ ఇవ్వడంతో శ్రావణి అంత్యక్రియలు నిర్వహించారు.

చదవండి: శ్రావణిని చంపిందెవరు?

మరిన్ని వార్తలు