‘బాస్‌’ల నివేదిక సిద్ధం

1 Nov, 2018 05:01 IST|Sakshi

కుట్ర కోణం ఏమీ లేదు

టీడీపీ వాళ్ళు చేయించలేదు

శ్రీనివాసరావు సంచలనం కోసమే పాల్పడ్డాడు

అతని మానసిక పరిస్థితి బాగోలేదు

ఇదీ... వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో త్వరలో వెల్లడి కానున్న సిట్‌ నివేదిక?

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జాతీయస్థాయిలో కలకలం రేపిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణ చేపట్టిన సిట్‌ నివేదిక అప్పుడే  సిద్ధమైపోయింది.  పోలీసు ఉన్నతాధికారులు, టీడీపీ పెద్దలు చెప్పినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పక్కాగా స్క్రిప్ట్‌ రెడీ చేసేసింది. ఈ హత్యాయత్నం  వెనుక భారీ కుట్ర దాగి ఉందనేది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ నేతాశ్రీలు మినహా కేంద్రం మొదలు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలూ అనుమానిస్తూ వచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర  పారిశ్రామిక  భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) ఉన్నతాధికారులు కూడా ప్రాధమిక విచారణలో కుట్ర అనే నిర్ధారణకు వచ్చారు. అయితే ఘటన జరిగిన క్షణం నుంచి కేసు నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు పెద్దలు చేయని ప్రయత్నమంటూ లేదు. విచారణకు సిట్‌ను వేసి కేసులో కుట్ర కోణాన్ని సమాధి చేసేందుకు అన్ని అధికారాలూ ఉపయోగిస్తున్నారు. ఆ ఒత్తిడితో దర్యాప్తు అధికారులుకూడా నివేదికను మమ అనిపించడానికి సిద్ధమయ్యారని విశ్వసనీయ సమాచారం.

కేసును తప్పుదోవ పట్టించిన హెడ్‌లు..
కేసును తప్పుదోవ పట్టించడానికి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ సైతం రంగంలోకి దిగారంటే వారి వ్యూహం ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చని కొందరు పోలీసు అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ హత్యలు ఎన్నో జగిగాయి. ఈ విధంగా ఇద్దరు ‘హెడ్‌’లు వెంటనే నేరుగా రంగంలోకి దిగడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని టి.హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరి సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. పక్కా ప్రణాళిక ప్రకారం నేరచరిత్ర ఉన్న శ్రీనివాసరావును తప్పుడు ఎన్‌వోసీ ఇప్పించి రెస్టారెంట్‌లో ఉద్యోగంలో పెట్టడం, గత మూడు నెలల కాలంలో దాదాపు ప్రతివారంలో రెండుసార్లు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న వైఎస్‌ జగన్‌కు ఎప్పుడూ లేని విధంగా గత గురువారం నాడే  రెస్టారెంట్‌ నుంచి కాఫీ తీసుకురావడం, ఆ రోజే శ్రీనివాసరావు జగన్‌పై హత్యాయత్నానికి ఒడిగట్టడం, ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు మొదలు టీడీపీ నేతలు, డీజీపీ సైతం అసలు అది దాడే కాదని ప్రచారం చేయడం.. సదరు దుండగుడు వైఎస్సార్‌ పార్టీ అభిమాని అని ప్రచారం పుట్టించడం  ఇందుకు అనుగుణంగా ఓ లేఖ సృష్టించడం... చంద్రబాబు ఎల్లో మీడియా దానికి తగ్గట్టుగా విపరీత ప్రచారం చేయడం... ఇలా వరుస పరిణామాలు టీడీపీ పెద్దల డ్రామాను దాచలేకపోయాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరిగినట్టు స్పష్టమవుతోంది.

ఎస్‌ బాస్‌...
ఇక పోలీసుల విచారణ తీరు టీడీపీ పెద్దల డ్రామాను మరింత రక్తికట్టించే విధంగా సాగింది. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు, ముగ్గురు ఏసీపీలు, పదిమంది సీఐలు, లెక్కలేనంతమంది ఎస్‌ఐలు విచారించినా... అతనేమీ మాట్లాడటం లేదని చెప్పుకొస్తూ వచ్చారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా, మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్నట్లు చెబుతున్న విశాఖ సీపీ మహేష్‌ చంద్ర లడ్హా కూడా నాలుగురోజులైనా నిందితుడు విచారణకు సహకరించడం లేదని చెప్పుకొచ్చారంటేనే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇప్పటివరకు వ్యూహాత్మకంగా విచారణ పేరిట డ్రామాను రక్తికట్టించిన పోలీసులు జ్యూడీషియల్‌ కస్టడీకి అప్పగించాల్సిన గడువు మరో రెండురోజులే ఉండటంతో పక్కా స్క్రిప్ట్‌తో తుది నివేదిక సిద్ధం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఇదే స్క్రిప్ట్‌
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం అవాంఛనీయ ఘటనే .. కానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఆ ఘటనకు టీడీపీ పెద్దలకు,  నాయకులకు ఎటువంటి సంబంధం లేదు.  అసలు అందులో కుట్రకోణమే లేదు.. ఇక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు  సానుభూతి కోసమో, టీడీపీ నేతలను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనో  వైఎస్సార్‌ పార్టీ నేతలు కూడా దీన్ని చేయించలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డీ చేయించుకోలేదు. కేవలం సంచలనం కోసం శ్రీనివాసరావు చేసిన పని ఇది.. ఆ కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు పోయేవి కానీ. అతని టార్గెట్‌ కూడా అది కాదు.. పబ్లిసిటీ కోసమే..అతను వైఎస్సార్‌సీపీ అభిమానే. ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి బాగోలేదు. అప్పుడప్పుడూ సైకోలా బిహేవ్‌ చేస్తున్నాడు. ఇంతకు మించి కేసులో కుట్రే లేదు’’  ఇదే స్క్రిప్ట్‌తో సిట్‌ నివేదికను పక్కాగా సిద్ధం చేసేశారు . శుక్రవారం సాయంత్రానికి శ్రీనివాసరావు పోలీస్‌ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, ఇద్దరు పోలీస్‌ బాస్‌ల మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ సిట్‌ నివేదిక పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పక్కా స్క్రిప్ట్‌తో రూపొందించిన సిట్‌ నివేదికను తిరిగి ప్రభుత్వానికే పంపించి, వారికి అవసరమైన మార్పులు, చేర్పులు చేయించి, వీలైనంత తొందరగా కేసును క్లోజ్‌ చేసేందుకు విశాఖ పోలీసు అధికారులు యత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

మరిన్ని వార్తలు