మావోయిస్టుల ఘాతుకం    

21 May, 2018 13:08 IST|Sakshi
తునాతునకలైన పోలీసు వాహనం

శక్తివంతమైన మందుపాతరతో పోలీసుల వాహనం పేల్చివేత

స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సహా ఆరుగురు జవాన్ల మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఘటన   

చర్ల/పర్ణశాల : ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. వరుస ఘటనల్లో తమ అనుచరులను కోల్పోతున్న మావోయిస్టులు మరోసారి ప్రతీకారం తీర్చుకున్నారు. సీఏఎఫ్, డీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఐఈడీ(ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌) బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా పరిధిలోని చోల్నార్‌ గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 10 గంటలకు జరిగింది. బచెలి నుంచి చోల్నార్‌ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు చేస్తున్న కూలీలకు రక్షణగా ఉండేందుకు బచెలి నుంచి ఒక బొలెరో వాహనంలో బచేలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ రాంకుమార్‌ యాదవ్‌తో పాటు సీఏఎఫ్, డీఎఫ్‌లకు చెందిన మరో ఆరుగురు జవాన్లు బయలుదేరారు.

జవాన్ల రాకను ముందుగానే గమనించిన మావోయిస్టులు మార్గమధ్యంలోని ఓ కల్వర్టు వద్ద ఏర్పాటు చేసిన శక్తివంతమైన మందుపాతరను పేల్చివేశారు. దీంతో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం సుమారు 20 అడుగుల మేర ఎత్తు ఎగిరి పడి తునాతునకలైంది.   స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ రాంకుమార్‌ యాదవ్‌తో పాటు టీకేశ్వర్‌ బర్గ్, తాలిగ్రాం, విక్రమ్‌యాదవ్, రాజేష్‌సింగ్, వీరేందర్‌నాథ్‌లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.

జవాన్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అర్జున్‌రాజ్‌వరున్‌ అనే జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం జవాన్లు మృతి చెందారని నిర్ధారించుకున్న మావోయిస్టులు రెండు ఏకే–47, రెండు ఎస్‌ఎల్‌ఆర్, రెండు ఐఎన్‌ఎస్‌ఏఎస్‌లు, రెండు గ్రెనేడ్లను అపహరించుకుపోయారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న బచేలి స్టేషన్‌ బలగాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ జవాన్‌ను అర్జున్‌ వరుణ్‌కు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు తరలించారు.  

ఘటనలో 200 మంది మావోయిస్టులు  

ఐఈడీ బాంబు పేల్చిన సమయంలో ఘటనాస్థలం వద్ద దాదాపు 200మంది సాయిధులైన మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడికి కోసం సుమారు యాభై కేజీల ఐఈడీని మావోయిస్టులు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు బలగాలు సంఘటన జరిగిన చుట్టూ గల అటవీప్రాంతంలో కూంబింగ్‌ ముమ్మరం చేశారు.

సంఘటన స్థలాన్ని బస్తర్‌ డీఐజీ రత్నల్‌ దాగ్ని పరిశీలించారు. ఈ నెల 22న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు రానున్నారు. ఈ పర్యటనకు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ దుర్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

మార్చిలో తొమ్మిది మంది 

ఈ ఏడాది మార్చి 13న సుక్మా జిల్లా క్రిష్టారాం పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో మావోయిస్టులు భారీ ఐఈడీ అమర్చి సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను క్యాంపునకు తీసుకెళ్తున్న  మైన్‌ ప్రొటెక్టెడ్‌ వాహనాన్ని పేల్చడంతో తొమ్మిది మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ దాడితో మావోయిస్టులు, పోలీసు బలాగాల మధ్య పరస్పర దాడులతో దండకారణ్య అట్టుడుకుతోంది. 

మరిన్ని వార్తలు