ఘోర రోడ్డు ప్రమాదాలు, ఆరుగురు దుర్మరణం

24 Mar, 2019 08:28 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : రెండు తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. ఏపీ, తెలంగాణలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్ర శివారులోని సమ్మక్క సారక్క హోటల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఓ యువతి చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

గరిడేపల్లి మండల కేంద్రంలో ఓ ఇంట్లో వీరన్న దేవుడి పండగ నిమిత్తం తెల్లవారుజామున గ్రామంలో ఊరేగింపుగా పుట్టమట్టి  కోసం వెళ్లారు. పుట్ట మన్ను తీసుకొని తిరిగి  ఊరేగింపుగా వస్తుండగా వారిపైకి  లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో  గ్రామానికి చెందిన మర్రి ఎంకమ్మ, ధనమ్మ చిలుకూరు మండలం బేతవోలు కు చెందిన  మట్టమ్మ అనే ముగ్గురు మహిళలు, ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రుల్లో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని హుటాహుటిన హుజూర్‌ నగర్‌  ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరగడంతో లారీ డ్రైవర్ నిద్రమత్తులో జనాల పై దూసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఘటనలో ఓ మహిళ మృతదేహం చిందరవందర అయింది . దీంతో పండుగ జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.

బైక్‌ను ఢీకొన్న బొలెరో, ఇద్దరు మృతి
ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లోడ్‌తో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దుర్గాప్రసాద్‌ (24). చిన్న దుర్గ (23) మృతి చెందగా, ప్రశాంత్‌ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు