కశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల కాల్చివేత

24 Nov, 2018 05:53 IST|Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లో లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతనాగ్‌ జిల్లాలోని బెజ్‌బెహారాలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు కమాండర్లు సహా ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడి వగహామా సుక్తిపొరాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్లు పక్కా సమాచారం అందడంతో ఆర్మీ ఆపరేషన్‌ ప్రారంభించింది. భద్రతాబలగాలు అనుమానిత ఇంటిని చుట్టుముట్టగానే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినవారిని అనంతనాగ్‌ జిల్లా లష్కరే కమాండర్‌ ఆజాద్‌ అహ్మద్‌ మాలిక్, జిల్లా హిజ్బుల్‌ కమాండర్‌ ఉనైస్‌ షఫీ, బాసిత్‌ ఇష్తియాక్, అతిఫ్‌ నాజర్, ఫిర్‌దౌస్‌ అహ్మద్, షహీద్‌ బషీర్‌గా గుర్తించారు. ఈ ఏడాది జూన్‌ 14న రైజింగ్‌ కశ్మీర్‌ పత్రిక ఎడిటర్‌ షూజాత్‌ బుఖారిని ఉగ్రవాదులు హత్యచేసిన ఘటనలో ఆజాద్‌ సూత్రధారి. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు