ఒకే రాత్రి ఆరు హత్యలు

16 Oct, 2019 08:19 IST|Sakshi
హత్యకు గురైన స్టీఫెన్‌, ఆనంద్‌, అనిత , విమల్‌ రాజ్‌

పెరుంబాక్కంలో ఇద్దరు

నామక్కల్‌లో మరో ఇద్దరు

రౌడీల వీరంగాలు జనం బెంబేలు

పెరుగుతున్న నేరాలు

సాక్షి, చెన్నై : రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఒక్క రాత్రి ఆరుగురు వేర్వేరు చోట్ల హత్యకు గురి కావడం ఆందోళన రేకెత్తిస్తున్నది. చెన్నై శివార్లలోని టాస్మాక్‌లో ఇద్దరు దారుణ హత్యకు గురికావడం బట్టి చూస్తే,  రౌడీలు రా జ్యమేళుతున్నట్టుగా పరిస్థితి మారడమే కాదు, కిరాయి ముఠాల వీరంగాలు పెరిగి ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది.
పెరుగుతున్న నేరాలు...

ఇటీవల కాలంగా రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. హత్య, దోపిడీలు, లైంగిక దాడులు, చైన్‌ స్నాచింగ్‌లు, చోరీలు అంటూ పత్రికల్లో వార్తలు లేని రోజంటూ లేవు. రౌడీ ముఖల వీరంగాలు, కిరాయి ముఠాల నేర పర్వాలు వెరసి ప్రజల్ని భయందోళనకు గురి చేస్తున్నాయి. ఎక్కడ ఏ సమయంలో హత్యలు జరుగుతాయో, దోపిడీ ఘటనలు వెలుగు చూస్తాయో, దారి దోపీడీలకు, కత్తిపోట్లకు గురి కావాల్సి ఉంటుందో అన్న ఆందోళన తప్పడం లేదు. ఈ హత్యల పర్వాలలో పాతకక్షలతో కొన్ని, వివాహేతర సంబంధాలతో మరికొన్ని, ఆస్తుల గొడవలు అంటూ ఇలా రోజుకో చోట హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సోమవారం రాత్రి ఏకంగా ఆరుగురు హత్యకు గురయ్యారు. ఇవన్నీ పాతకక్షలు, ఆస్తుల వివాదాలు, వివాహేతర సంబంధాలతోనే జరిగి ఉండడం గమనార్హం.

టాస్మాక్‌లో మర్డర్‌....
చెన్నై శివారులోని వేళచ్చేరి సమీపంలో ఉన్న పెరుంబాక్కం ఇందిరానగర్‌కు చెందిన ఆనంద్‌(29), స్టీఫెన్‌(23) రాత్రి మద్యం సేవించేందుకు సమీపంలోని టాస్మాక్‌ మద్యం దుకాణానికి వెళ్లారు. మద్యానికి చిత్తై ఉన్న ఈ ఇద్దరితో అటువైపుగా మూడు మోటార్‌ సైకిళ్ల మీద వచ్చిన ఆరుగురు వాగ్వివాదానికి దిగారు. ఈ వివాదం ముదరడంతో తమ వెంట తెచ్చుకున్న పట్టా కత్తులకు ఆ ఆరుగురు పని పెట్టారు. ఆనంద్, స్టీఫెన్‌లను అతి కిరాతకంగా నరికి పడేసి ఉడాయించారు. టాస్మాక్‌ ఆవరణలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడి మందుబాంబుల్నే బెంబేళెత్తించింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ ఇద్దర్ని పరిశీలించగా, స్టీఫెన్‌ సంఘటనా స్థలంలోనే మరణించాడు. కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ఆనంద్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ సమాచారంతో పళ్లి కరణై పోలీసులు రంగంలోకి దిగి, ఆ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం వేట మొదలెట్టారు. గత వారం ఆలయ ఉత్సవాల సందర్భంగా జరిగిన గొడవే ఈ హత్యలకు కారణంగా ఉండ వచ్చన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు మంగళవారం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. పెరుంబాక్కంకు చెందిన ఆరుగురికి కోసం గాలింపు తీవ్రతరం చేశారు.

మరో నాలుగు.....
మదురైలో మరో ఘటన రాత్రి చోటుచేసుకుంది. కిట్టాలాచ్చి నగర్‌కు చెందిన రంజిత్‌కుమార్, శుభా దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇటీవల శుభా ఆటోడ్రైవర్‌ ప్రకాష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని ఉడాయించింది. గోమతి అనే మహిళతో సహజీవనం చేస్తూ వస్తున్న రంజిత్‌కుమార్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. గోమతితో రంజిత్‌కుమార్‌ గదిలో ఉన్న సమయంలో చొరబడ్డ నలుగురు వ్యక్తులు వచ్చి రాగానే, అతడి మర్మాంగాన్ని కొసి పడేశారు. తలపై, గొంతు మీద వేట కొడవళ్లతో నరికారు. పక్కనే ఉన్న గోమతి మీద దాడికి యత్నించగా, ఆమె  తప్పించుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలాగే, నామక్కల్‌లో విమల్‌ రాజ్, అనిత దంపతులు హత్యకు గురయ్యారు. అనిత అన్న అరుణ్‌ మరో మహిళతో పెట్టుకున్న  వివాహేతర సంబంధం కారణంగా, ఈ దంపతులు బలి అయ్యారు.ఈకేసులో అరుణ్‌ స్నేహితుడు నికల్సన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికల్సన్‌ భార్యతో అరుణ్‌ పెట్టుకున్న వివాహేతర సంబంధానికి అతడి చెల్లి, బావ దారుణ హత్యకు గురయ్యారు. ఇక, పుదుకోట్టైలో ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌కు అసిస్టెంట్‌గా ఉన్న ఒకరి సమీప బంధువుగా ఉన్న  వినోద్‌ చక్రవర్తి హత్యకు గురయ్యాడు.   

>
మరిన్ని వార్తలు