విషవాయువు పీల్చడంతో.. ఆరుగురి మృతి

30 Mar, 2018 13:44 IST|Sakshi

కోల్‌కతా: విషవాయువు పీల్చడంతో ఆరుగురు మృతి చెందిన విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. హజీనగర్‌లోని పేపర్‌ మిల్లులో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హజీనగర్‌లోని పేపర్‌ మిల్లులో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంపులను సరిచేసేందుకు ఇద్దరు కార్మికులు మిల్లు లోపల గల బావిలోకి దిగారు. మిల్లు నుంచి వెలువడే వ్యర్థాలతో నిండిన బావిలో విషవాయువు వెలువడటంతో వారు స్పృహ తప్పి పడిపోయారు.

లోపలికి దిగినవారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారికి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని మరో నలుగురు కార్మికులు కూడా బావిలోకి దిగారు. కానీ వారు కూడా విషవాయువు బారిన పడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గమనించిన ఉద్యోగులు ఫైర్‌ బ్రిగేడ్‌ను అప్రమత్తం చేసి కార్మికులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషవాయువును అధికంగా పీల్చడంతో వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే..
పేపర్‌ మిల్లులోని వ్యర్థాలను బయటికి వదిలేందుకు సరైన వసతి లేకపోవడంతో బావిలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. విషవాయులున్న బావిలోకి దిగిన కార్మికులకు గ్యాస్‌ మాస్కులు కూడా అందించలేదు. కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా, కార్మికుల మృతికి కారణమైన మిల్లు యజమానిని అదుపులో​కి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు