అయ్యో పాపం.. జ్ఞానేశ్వరి

28 Nov, 2018 12:15 IST|Sakshi
సంఘటనా స్థలంలో రోదిస్తున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, ఇన్‌సెట్‌లో జ్ఞానేశ్వరి (ఫైల్‌ ) 

కొల్చారం(నర్సాపూర్‌): పుట్టుకతోనే మాటలురాని ఆరేళ్ల చిన్నారి ఐదురోజుల క్రితం తప్పిపోయి శవమై కనిపించింది. అసలేం జరిగిందో తెలియదు కాని ఆ తల్లిదండ్రులకు తీరనిశోకమే మిగిలింది. కొల్చారం మండలం రంగంపేట శివారులోని కొత్త చెరువు సమీప పొలాల్లో ఆరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి శవం మంగళవారం లభ్యమైంది. మృతిచెందిన చిన్నారి మండలంలోని ఎనగండ్ల గ్రామానికి చెందిన ఏష బోయిన శ్రీశైలం కూతురు జ్ఞానేశ్వరి(6)గా గుర్తించారు. కొల్చారం ఎస్సై పెంటయ్య, చిన్నారి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కొల్చారం మండలం సదాశివనగరానికి చెందిన కంచర్ల కిష్టయ్య పెద్దకూతురు మొగులమ్మ. మొదటి భర్త మరణించడంతో కూతురు మొగులమ్మను, మనవరాలు జ్ఞానేశ్వరిని పుట్టింటికి తీసుకువచ్చాడు.

ఆ తరువాత కూతురుకు ఎనగండ్ల గ్రామానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ల క్రితం రెండో వివాహం చేశాడు. వారు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. గత శుక్రవారం కూతురు జ్ఞానేశ్వరిని భర్త వద్ద వదిలి మొగులమ్మ కూలీ పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన మొగులమ్మ కూతురు ఏదంటూ భర్తను అడగడంతో ఇప్పుడే అన్నం తిని బయటకు వెళ్లినట్లు తెలిపాడన్నారు. రాత్రి 8 దాటినా కూతురు రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారిని అడిగినా సమాచారం లభించకపోవడంతో రంగంపేటలోని బంధువులకు విషయం తెలిపారు.

ఐదు రోజులుగా జ్ఞానేశ్వరికోసం గాలించిన బంధువులు, తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం రంగంపేట శివారులోని కొత్త చెరువు సమీప పొలంలో చిన్నారి మృతదేహం ఉన్నట్లు రంగంపేట గ్రామసేవకుల ద్వారా సమాచారం రావడంతో జ్ఞానేశ్వరి బంధువులు అక్కడికి వెళ్లి చూశారు. అప్పటికే శవం కుళ్లిపోగా శరీరంపై ఉన్న దుస్తులను చూసి జ్ఞానేశ్వరిగా గుర్తించారు. ఘటన స్థలంలో చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

జ్ఞానేశ్వరి కాళ్లు, చేతులకు అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన చేపల వల చుట్టుకోవడం, నిర్మానుష్య ప్రదేశం కావడం, అరిచేందుకు మాటలు రాకపోవడం చిన్నారి మృతిచెందడానికి కారణమై ఉండవచ్చు అన్న అనుమానాలను ఎస్సై పెంటయ్య వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి క్లూస్‌ టీం డాగ్‌ స్క్వాడ్‌లను రప్పించి పరిసరాలను క్షున్నంగా పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై పెంటయ్య కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు